పాదయాత్రలో ఉన్న ప్రతిపక్ష నేత వైసిపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి, ఈ రోజు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. నిన్న శుక్రవారం కావటంతో, జగన్ కోర్టు వాయిదా ముగించుకుని పిఠాపురం వచ్చారు. శనివారం పిఠాపురం మండలంలోని చెందుర్తి క్రాస్ రోడ్డు నుంచి పాదయాత్ర కొనసాగించారు. అయితే ఈ రోజు సాయంత్రం పాదయాత్రలో ఉండగా కొంత అస్వస్థతకు గురయ్యారు. ఆయన జలుబు, జ్వరంతో బాధపడుతున్నట్లు సమాచారం. అయితే ఆదివారం నుంచి పాదయాత్ర కొనసాగిస్తారా లేక విశ్రాంతి తీసుకుంటారనే అనేది సందిగ్ధంగా మారింది. పాదయాత్ర కొనసాగింపుపై వైసీపీ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. ఇప్పటివరకు జగన్ 228 రోజులు పాదయాత్ర చేశారు. అయితే, ఈ లెక్క శుక్రవారం సెలవలతో కలిపో లేదో తెలియదు.
మరో పక్క, జగన్‌కు కాపుల సెగ ఈ రోజు కూడా తగిలింది. కాపు రిజర్వేషన్లు కేంద్రం పరిధిలోని అంశం చెప్పిన జగన్‌కు ఆ వర్గం నుంచి ఊహించని రీతిలో నిరసన ఎదురైంది. పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలులో జగన్ పాదయాత్రకు కాపుల నుంచి నిరసనలు ఎదురయ్యాయి. రిజర్వేషన్లపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలని ప్లకార్డులు, నల్లజెండాలతో నిరసన తెలిపారు. జగన్ భద్రతా సిబ్బంది ఆందోళనకారులను నెట్టేశారు. ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కాపు వర్గానికి చెందిన యువకులు జగన్ తీరుకు వ్యతిరేకంగా సమీపంలోని వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. అయితే జగన్ మాత్రం ఏం మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుంచి వెళ్లిపోయారు.
పిఠాపురం మండలం ఎఫ్.కె పాలెం గ్రామంలో జగన్‌కు కాపు సెగ తగిలిన విషయం తెలిసిందే. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ కాపు ప్రజలు, నాయకులు జగన్‌కు నిరసన తెలిపారు. కాపు రిజర్వేషన్లకు మద్దతుగా నిలబడి పోరాడాలని డిమాండ్ చేశారు. కాపు రిజర్వేషన్ల విషయంలో జగన్ వైఖరిలో మార్పు రాకపోతే ఆయనకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కాపు నాయకులు స్పష్టం చేశారు. కాపుల ఆందోళన చూస్తూ ఉంటే జగన్ తూర్పుగోదావరి జిల్లాలో యాత్ర ముగించే వరకు ఆ సామాజిక వర్గం నుంచి నిరసనలు కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి.