వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి నిర్వహించిన ఎన్నికల ప్రచార యాత్రలు పగలు ఆంధ్రప్రదేశ్‌లో, రాత్రుళ్లు హైదరాబాద్ లోట్‌సపాండ్‌లో అన్నట్లుగా సాగాయి. ఇంకా వింత ఏంటి అంటే, ఈ రోజు పోలింగ్ అని తెలిసినా, నిన్న కూడా హైదరాబాద్ లోటస్ పాండ్ లో నే ఉండిపోయారు. జగన్ పార్టీ ఈసారి తెలంగాణలో పోటీ చేయడంలేదు. ఆంధ్రప్రదేశ్‌పైనే తన శక్తులన్నింటినీ కేంద్రీకరించి ప్రచార పోరాటం ముగించింది. ప్రచారం సాగే రోజుల్లో చివరి ప్రసంగం తరువాత, సహజంగా నేతలు అక్కడే బస చేస్తారు. అక్కడ వసతులు లేవనుకొంటే, సమీప పట్టణంలో విశ్రాంతి తీసుకొంటారు. ఏమైనా రాష్ట్రంలోనే మకాం వేస్తారు. ఆ సమయంలో మరునాటి ప్రచార వ్యూహాలపై ముఖ్యులతో సమాలోచనలు జరుపుతారు. కార్యకర్తలను కలుసుకొంటారు. ఈ రాజకీయ సంప్రదాయానికి విరుద్ధంగా, జగన్ ప్రచారాన్ని ముగించుకొని ప్రతిరోజూ తెలంగాణ రాజధాని హైదరాబాద్ వెళ్లారు.
టీఆర్‌ఎస్ పెద్దల సలహాలు, సూచనల మేరకు తన ప్రచార వ్యూహాలకు ఆయన పదును పెట్టుకొనేవారని, దానికోసమే ఎంత రాత్రయినా హైదరాబాద్ లోట్‌సపాండ్‌లోని తన నివాసానికి చేరుకొనేవారని రాజకీయవర్గాలు విశ్లేషిస్తున్నాయి. వైఎస్ జగన్మోహన రెడ్డి మొత్తం 24 రోజులపాటు రాష్ట్రంలోని 13 జిల్లాలను చుట్టేశారు. ఈ క్రమంలో 68 బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఒక్కోసారి మారుమూల ప్రాంతాలకు సైతం వెళ్లారు. ఇలా పగలంతా రాష్ట్రంలో ఎక్కడకు వెళ్లినా ఏగూటి పక్షి ఆ గూటికే చేరుతుందన్నట్లుగా, సాయంత్రానికి మాత్రం లోట్‌సపాండ్ నివాసానికి జగన్ చేరుకుంటూ వచ్చారు. రాజకీయ మంత్రాంగం కోసం ప్రత్యేకంగా ‘‘వార్ రూమ్’’ను ఆయన తన నివాసంలో ఏర్పాటు చేశారు.
ఎంపీ విజయసాయిరెడ్డి, జగన్ రాజకీయ సలహాదారు ప్రశాంత్ కిశోర్‌తో సహా ముఖ్యనేతలంతా అక్కడ ఎన్నికల వ్యూహాలపై ప్రణాళికలు రచించారు. ఎప్పటికప్పుడు ఈ నేతలు అక్కడి నుంచే టీఆర్‌ఎస్ ముఖ్యనేతలతో సమాలోచనలు జరిపేవారని రాజకీయవర్గాల్లో జోరుగా ప్రచారం సాగింది. ఎన్నికల సమయంలో రాష్ట్రంలో ఉంటూ, రాజకీయ వ్యూహప్రతివ్యూహాలు సాగించడం, పార్టీ నేతలకు ఎప్పటికప్పుడు సూచనలు చేయడం సహజం. దీనికి భిన్నంగా పొరుగు రాష్ట్ర రాజధానిలో కూర్చొని రాజకీయ వ్యూహాలను రచించిన తీరుపై రాజకీయ వర్గాల్లో విస్మయం వ్యక్తం అవుతోంది. ఇప్పుడు ఇదే ప్రధాన చర్చగా మారింది. పాదయాత్రలో తిరగని ప్రాంతాలను బస్సు యాత్ర ద్వారా చేరుకోవాలని వైఎస్ జగన్ తొలుత ఆలోచించారు. ఏమయిందో ఏమోగానీ ఆ యాత్ర అర్ధంతరంగా రద్దయింది. ఒకవేళ బస్సు యాత్ర చేపడితే, అక్కడే బస చేయాలి. అప్పుడు తన రహస్య మిత్రులను కలుసుకోవడం వీలు కాదని జగన్ భావించారని చెబుతున్నారు.