పక్కా ప్రణాళిక ప్రకారమే వైకాపా అధినేత జగన్‌పై నిందితుడు శ్రీనివాస్ దాడి చేశాడని విశాఖ నగర పోలీస్ కమిషనర్ మహేశ్ చంద్ర లడ్డా వెల్లడించారు. వాస్తవానికి గతేడాది అక్టోబర్ 18నే దాడి చేయాలని శ్రీనివాస్ ప్రణాళిక రూపొందించినప్పటికీ అది సాధ్యం కాలేదని తెలిపారు. అక్టోబర్ 25న జగన్‌పై విశాఖ విమానాశ్రయంలో కోడికత్తితో జరిగిన దాడికి సంబంధించి మీడియాతో మాట్లాడారు. కేసుకు సంబంధించి కీలక వివరాలను వెల్లడించారు. నిందితుడు శ్రీనివాస్ వెల్డర్‌గా, కేక్ మాస్టర్‌గా, కుక్‌గా పలు చోట్ల పనిచేశాడని సీపీ తెలిపారు. దాడి జరిగిన రోజున నిందితుడు శ్రీనివాస్ కోడికత్తికి సాన పట్టించాడని, దీన్ని అతడి సహచరులు కూడా చూశారని చెప్పారు. జగన్ చొక్కా, కత్తి, ల్యాబ్ రిపోర్ట్‌లు అందాయని, శ్రీనివాసరావు హ్యాండ్ రైటింగ్ రిపోర్టులు అందాయని సీపీ లడ్డా అన్నారు.
జగన్‌ను హత్య చేయాలని దాడి చేయలేదని, కేసులో ఇప్పటి వరకు 92 మందిని విచారించామని సీపీ లడ్డా వెల్లడించారు. దాడి జరిగిన రోజు పక్కా ప్రణాళికతో ఇంటి నుంచి శ్రీనివాస్ ఉదయం 4.55 గంటలకే బయల్దేరాడని చెప్పారు. ఉదయం 8 గంటలకు హేమలత, అమ్మాజీ అనే మహిళలకు ఫోన్ చేసి ‘ఈ రోజు నన్ను టీవీలో చూస్తారు’ అని, అమ్మాజీతో ‘ఒక సంచలనం చూస్తారు’ అని పలుమార్లు శ్రీనివాస్ చెప్పాడని సీపీ పేర్కొన్నారు. ఎంపీ, ఎమ్మెల్యే మాదిరిగా నా వద్దకు కూడా పీఏ అపాయింట్‌మెంట్ తీసుకొని రావాలని ఆమెతో చెప్పాడని తెలిపారు. ఉదయం 9గంటల సమయంలో రెస్టారెంట్‌లో కూడా కోడికత్తికి సానపెట్టాడని తెలిపారు. రెండుసార్లు కోడికత్తిని వేడి నీటిలో స్టెరిలైజ్ చేశాడని, హైదరాబాద్ వెళ్లేందుకు విశాఖ విమానాశ్రయంలో వైకాపా నేత ధర్మశ్రీతో జగన్ మాట్లాడుతున్నప్పుడు శ్రీనివాస్ దాడి చేశాడని లడ్డా వెల్లడించారు.
2017 జనవరిలో జగన్‌తో ఉన్న ఫ్లెక్సీని తయారు చేయించాడని, అక్టోబర్ 18నే జగన్‌పై దాడి చేసేందుకు శ్రీనివాస్ ప్రణాళిక వేశాడని చెప్పారు. అయితే, అక్టోబర్ 17నే జగన్ హైదరాబాద్ వెళ్లడంతో అది సాధ్యపడలేదని లడ్డా వెల్లడించారు. జాతీయ భద్రతా అంశాలు ఉంటేనే ఈ కేసును ఎన్‌ఐఏ దర్యాప్తు చేస్తుందని, శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని గంటల్లోనే వివరాలు చెప్పాల్సి వచ్చిందని స్పష్టంచేశారు. జగన్‌పై విష ప్రయోగం చేయాలనే ఉద్దేశం నిందితుడికి లేదనే విషయం విచారణలో వెల్లడైందని సీపీ తెలిపారు. తనపై దాడి ఘటనపై జగన్ ఇప్పటికీ ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్నారు. హైకోర్టు తాము చెప్పేదాకా ఛార్జిషీట్ దాఖలు చేయవద్దని చెప్పిందని ఈ సందర్భంగా సీపీ మీడియాకు వివరించారు.