పోలవరం ప్రాజెక్ట్ పై నెలకొన్న అనిశ్చితి పై జగన్ మోహన్ రెడ్డి కేంద్రానికి లేఖ రాసారు. ప్రధాని నరేంద్ర మోడీకి సవివరంగా జగన్ లేఖ రాసారు. గత కొన్ని రోజులుగా, పోలవరం సవరించిన అంశాల పై చర్చ జరుగుతుందని, దీనిని మీ దృష్టికి తెస్తున్నాను అంటూ లేఖలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని సెక్షన్ 90లో పోలవరం ప్రాజెక్ట్ ని జాతీయ ప్రాజెక్ట్ గా చెప్పారని, కేంద్రం ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి అన్ని అనుమతులు తెచ్చి, పోలవరం ప్రాజెక్ట్ తో పాటుగా, ఆర్ అండ్ ఆర్ కూడా చేస్తుందని చెప్పారని గుర్తు చేసారు. ఏప్రిల్ 1, 2014 వరకు పెట్టిన ఖర్చు మినిహా, దాని తరువాత నుంచి పెట్టిన ఖర్చు మొత్తం ఇస్తాం అని చెప్పారని గుర్తు చేసారు. అలాగే 2013 ల్యాండ్ అక్విజిషన్ ఆక్ట్ ప్రకారం, ఖర్చు పెరుగుతుందని కూడా చెప్పారని లేఖలో తెలిపారు. కేంద్ర క్యాబినెట్ నోట్ లో కూడా, పెరిగిన ఖర్చు మొత్తాన్ని కేంద్రమే పెట్టుకుంటుందని చెప్పారని అన్నారు. ప్రాజెక్ట్ పూర్తి కోసం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీని కూడా పెట్టారని గుర్తు చేసారు. అయితే జగన్ మోహన్ రెడ్డి ఈ ఉత్తరంలో ఒక కీలక విషయం చెప్పారు. గత చంద్రబాబు హయంలో, రాష్ట్రాన్ని, పూర్తి స్థాయి రివైజడ్ ఎస్టిమేట్స్ గురించి అడిగారని, దానికి తగ్గట్టు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం, అంటే 02-01-2018లో 2017-18 రివైజడ్ ఎస్టిమేట్స్ ప్రకారం రూ 57,292.42 కోట్లు అవుతుందని కేంద్రానికి సవరించిన అంచనాలు సమర్పించారని చెప్పారు.
దీని ప్రకారం, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ, 55,548.87 కోట్లకు సవరించిన అంచనాలు ఒప్పుకుంటూ, రాష్ట్రానికి 18.2.2019న ఆమోదం తెలిపిందని చెప్పారు. అంటే చంద్రబాబు హయంలోనే 55,548.87 కోట్లకు కేంద్రం ఒప్పుకున్నట్టు, జగన్ గారే తన లేఖలో ప్రధానికి తెలిపారు. అయితే తన హయంలో అంటే, తాను అధికారంలోకి వచ్చిన తరువాత, చంద్రబాబు హయంలో ఒప్పుకున్న 55,548.87 కోట్లను, కేంద్రం తగ్గించి 47,617.74 కోట్లకు ఒప్పుకుందని, అంటే చంద్రబాబు హయాంకు, తన హయాంకు, దాదాపుగా 8 వేల కోట్లు కోత పెట్టిందని జగన్ గారే ఒప్పుకున్నారు. అలాగే చంద్రబాబు హయంలో ఖర్చు చేసిన 12520.91 కోట్లతో, రూ.4,013.65 కోట్లు ఇంకా పెండింగ్ ఉందని, అది కూడా విడుదల చెయ్యాలని కోరుతున్నారు. అలాగే ఇంత అంచనాలు పెరగటానికి కారణం, కేవలం ఆర్ అండ్ ఆర్ కి మాత్రమే రూ.28,191.03 కోట్లు అవుతాయని అన్నారు. ఒక్క అండ్ ఆర్ కి రూ.28,191.03 కోట్లు అయితే, మీరు 20 వేల కోట్లకు ఎలా ఆమోదిస్తారని, ప్రధానికి రాసిన లేఖలో జగన్ తెలిపారు. అయితే ఇక్కడ ప్రధానికి లేఖ కాబట్టి అన్నీ వాస్తవాలు రాసారు. బయటేమో చంద్రబాబు ఏమి చేయలేదు అని చెప్తూ, ప్రధానికి రాసిన ఉత్తరం మొత్తం, చంద్రబాబు చేసిన పని గురించి చెప్పుకుని, అడుగుతున్నారు. అంటే వైసీపీ చేసిన ఆరోపణలు జగన్ గారే ఖండించినట్టు అనమాట.