తెలంగాణ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు ఈరోజు వైసీపీ అధినేత జగన్ తో భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో ఉన్న జగన్ నివాసానికి మోత్కుపల్లి వచ్చారు. ఆయన్ను వైసీపీ నేతలు సాదరంగా లోపలకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏపీ, తెలంగాణలో రాజకీయ పరిస్థితులతో పాటు భవిష్యత్ కార్యాచరణపై జగన్ తో ఆయన సుదీర్ఘంగా చర్చించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానిస్తే టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్దమని నిన్న మోత్కుపల్లి ప్రకటించారు. అంతేకాకుండా ఏపీ సీఎం చంద్రబాబు పై కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వ విధానాలను తీవ్రంగా తప్పుపట్టారు. ఈ నేపథ్యంలో జగన్ తో ఈరోజు మోత్కుపల్లి భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
‘బాబు ఓ అసమర్థుడు. ఆయనకు ఏపీలోనే దిక్కులేదు, ఇక తెలంగాణకు ఏం చేయగలడు’అని ప్రశ్నించారు. ప్రస్తుతం తెలంగాణ తెలుగుదేశం నేతలంతా టీఆర్‌ఎస్‌తో కలిసి పనిచేసేందుకు సుముఖంగా ఉన్నారని, సీఎం పిలిస్తే పార్టీలో చేరేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. రాజకీయాల్లో మూడున్నర దశాబ్దాలుగా ఉన్న మోత్కుపల్లి నర్సింహులు క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు. తెలుగుదేశం నుంచి దూరం అయిన తరువాత, ఎవరూ ఆయనను దగ్గరకు రానివ్వ లేదు. జగన్ మాత్రమే పిలిచి కుట్రలు పన్నారు. టీడీపీ ఆవిర్భావంతో ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైంది. దళిత విద్యార్థి నాయకుడుగా మోత్కుపల్లి నర్సింహులు ఆలేరు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి విజయం సాధించారు.
ఇక్కడ నుంచే వరుసగా ఆరుసార్లు, తుంగతుర్తి నుంచి ఒకసారి గెలిచిన ఆయన ఎన్టీఆర్ మంత్రివర్గంలో విద్యుత్, సాంఘిక సంక్షేమ, టూరిజం మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో ఖమ్మం జిల్లా మధిర నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత పరిణామాల్లో గవర్నర్ కావాలని అడగటం, బీజేపీ వేస్తున్న వేషాలు తట్టుకోలేక చంద్రబాబు బయటకు రావటంతో, ఆయన గవర్నర్ ఆశలు అడియాసాలు అయ్యాయి. దీంతో పార్టీ అధినేత చంద్రబాబు పై చేసిన విమర్శల కారణంగా టీడీపీ వేటుకు గురయ్యారు. ఆలేరు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు మళ్ళీ లోటస్ పాండ్ లో ప్రత్యక్షమయ్యారు.