వైఎస్ వివేకా హత్య కేసులో జగన్ ఎందుకు అంత కంగారు పడుతున్నారు? ఓసారి టీడీపీపై ఆరోపణలు చేస్తారు? మరోసారి సీబీఐ విచారణ కావాలంటారు? ఇంకోవైపు ఎన్నికలయ్యేవరకు సిట్ నివేదిక బయటపెట్టవద్దని అంటారు? కుటుంబ సభ్యుడి హత్య జరిగితే సత్వర న్యాయం కోరుకుంటారుగానీ.. జగన్ ఎందుకిలా పదే పదే మాట మారుస్తున్నారు? వివేక కుమార్తె రెండ్రోజులకొసారి ప్రెస్ మీట్ పెట్టి కొత్త వాదన ఎందుకు వినిపిస్తున్నారు? ఎస్పీ బదిలీతో ఏంజరగబోతోంది? ఆ రోజు వివేకా చనిపోయిన రోజు ఉదయం గుండెపోటని బాధాతప్త హృదయంతో చెప్పారు. మధ్యాహ్నానికి అనుమానాస్పద మృతి అని అన్నారు. సాయంత్రానికి అసలు విషయం తేలడంతో చంద్రబాబే చేయించారని జగన్ అన్నారు.
పోలీస్ ఓ కొలిక్కి వచ్చేటప్పటికి వివరాలు బయట పెట్టవద్దని అంటున్నారు. వివేకా హత్య కేసులో వైసీపీ నేతల విధానం ఇంతే. కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణ కావాల్సిందేనని హైకోర్టుకు వెళ్లిన వారు సిట్ విచారణ నివేదిక బయటపట్టవద్దని అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. బాధితులు ఎవరైనా ఇలాంటి పిటిషన్ ఇంతకుముందు దాఖలు చేసినట్లు లేకపోవడంతో న్యాయవాది వర్గాలు కూడా ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. అసలు పోలీసులు విచారణలో ఏం తేల్చారో ఇంతవరకు బయటకు రాలేదు. సున్నితమైన విషయం కావడంతో పోలీసులు గుట్టుగా విచారణ జరుపుతున్నారు. అయితే గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లుగా విచారణ వద్దన్నట్లుగా జగన్ వ్యవహరిస్తున్నారు.