ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్, హైకోర్టులో పిటిషన్ వేసారు.. తన కేసుల పై బెయిల్ కోసమో, లేక స్టే ఆర్డర్ కోసమో కాదు. విశాఖ విమానాశ్రయంలో తన పై జరిగిన దాడి ఘటనలో వైఎస్ జగన్ హైకోర్టును ఆశ్రయించారు. తన పై జరిగిన హత్యాయత్నం ఘటన పై ఈ రోజు కోర్ట్ లో పిటీషన్ వేసారు. తన పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఫల్యం వల్లె హత్యాయత్నం జరిగిందని ఆయన కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ ఘటన వెనుక కుట్ర ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. కేసు విచారణ సరిగ్గా జరగడం లేదని, పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తూ రాజ్యాంగబద్ధంగా కాకుండా రాజకీయంగా కేసు ధర్యాప్తు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
హత్యాయత్నం ఘటన పై కేంద్ర ధర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని ఆయన కోరారు. రాష్ట్ర ప్రభుత్వ అజమాయిషీ లేని స్వతంత్ర సంస్థలతో దర్యాప్తు చేయించాలని జగన్ ఉన్నత న్యాయస్థానాన్ని కోరారు. ఈ పిటీషన్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు డీజీపీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, తెలంగాణ డీజీపీ తదితరులను ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటీషన్ రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఇక, ఘటన తర్వాత చంద్రబాబు నాయుడు, ఏపీ మంత్రులు, డీజీపీ బాధ్యతారహితంగా మాట్లాడారని, అందుకు సంబంధించి వీడియో క్లిప్పింగులను కూడా జగన్ పిటీషన్ లో జతచేశారు.
మొత్తం 11 పేజీల కాపీని కోర్టుకు అందజేశారు. ఆపరేషన్ గరుడ పేరుతో తనపై కుట్ర జరుగుతుందని పేర్కొన్నారు. సినీ నటుడు శివాజీ తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడని, తనపై దాడి జరుగుతుందని శివాజీ ముందే చెప్పారని, తనను హత్య చేసి ఆపరేషన్ గరుడలో భాగమంటూ చిత్రీకరించాలని చూస్తున్నారని పిటీషన్ లో జగన్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టులో హాజరయ్యేందుకు ప్రతిపక్ష నేత జగన్ గత గురువారం విశాఖ విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్‌లో కూర్చొని ఉండగా,సెల్ఫీ నెపంతో వచ్చిన శ్రీనివాసరావు అనే యువకుడు జగన్ పై కోడి కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ వ్యక్తి, వైసీపీకి వీరాభిమాని కావటంతో, కేసు మలుపులు మీద మలుపులు తిరుగుతుంది.