రోజూ వైసీపీ మంత్రులు విశాఖ నుంచి పరిపాలన ప్రారంభిస్తారని ముహూర్తాలు ప్రకటిస్తుంటారు. చాలా రోజులుగా ఇదే జరుగుతోంది. కానీ విశాఖలో అడుగు పెట్టలేదు. హైకోర్టులో కేసు ఉన్నా రుషికొండకి గుండు కొట్టడం ఆపడంలేదు. అది పర్యాటక ప్రాజెక్టు కాదు, సీఎం క్యాంప్ ఆఫీసు అని వైసీపీ నేతలే బరితెగించి మరీ ప్రకటిస్తున్నారు. పిల్లలకు పుస్తకాలు ఇవ్వడానికి ఖజానాలో డబ్బులేదు. ఆస్పత్రిలో దూదికీ దిక్కులేదు. కాంట్రాక్టర్లకి లక్ష రూపాయలు బిల్లు ఇవ్వలేక అధికారులు కోర్టు బోనులో నిలబడుతున్నారు. చివరికి సీఎం పర్యటనకి పరదాలు కట్టేవాళ్లకి పైసలు చెల్లించలేదు. బాండ్ల వేలం ద్వారా అప్పు దొరికితే తప్పించి ప్రతీ నెలా రెండో వారమైతే జీతాలు ఇవ్వలేని దుస్థితి. ఇటువంటి ఆర్థిక సంక్షోభంలో రాష్ట్రం కొట్టుమిట్టాడుతుంటే అత్యవసరాల కోసం అత్యధిక వడ్డీకి అప్పుతెచ్చిన 19 కోట్లతో కొన్న కొత్త కార్ల కాన్వాయ్ విశాఖ కోసం అని వైసీపీ సర్కిల్లో టాక్ వినిపిస్తోంది. నేడో రేపో విశాఖలో బస చేయనున్న జగన్, కోర్టు కేసుకి ఇబ్బంది లేకుండా సీఎం క్యాంప్ ఆఫీసు నుంచి పరిపాలన సాగిస్తారని సమాచారం. రుషికొండ గుండుకి కోర్టు అడ్డంకి ఏర్పడితే, ఆంధ్రా యూనివర్సిటీలో మూడు భవనాలు సిద్ధం చేస్తున్నారు. విశాఖకి వెళ్లేందుకు జగన్ బాగా తహతహలాడుతున్నారని మాత్రం అర్థం అవుతోంది.
రూ.19 కోట్లతో జగన్ కు కొత్త కాన్వాయ్ రెడీ.. త్వరలో విశాఖకి జగన్ బస ?
Advertisements