వైసీపీ అధినేత జగన్ ఎక్కడున్నారు? పార్టీ నేతలకు జగన్ ఎందుకు అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదు? వైసీపీ వర్గాల్లో ఇప్పుడిదే చర్చ. ఏపీలో ఎన్నికలు ముగిసిన తరువాత వైసీపీ శ్రేణులు అధికారం తమదేనని చెప్పుకుంటున్నాయి. పోలింగ్ ముగిసిన రోజు జగన్ కూడా ఇదే చెప్పుకొచ్చారు. తమదే అధికారమని.. ప్రమాణ స్వీకార తేదీని ఆ దేవుడే నిర్ణయిస్తాడని వ్యాఖ్యానించారు. ఆ తరువాత జగన్ పార్టీ వ్యవహారాలపై పెద్దగా దృష్టి పెట్టలేదు. అప్పటి నుంచి రిలాక్సింగ్ మూడ్‌లోనే ఉన్నారు. ఓ రోజు బొత్స కుటుంబ సభ్యుల వివాహానికి జగన్ విశాఖ వెళ్లారు. ఆ తరువాత హైదరాబాద్‌లో అవెంజర్స్ సినిమా చూశారు. అయితే పార్టీ అగ్ర నేతలకు మినహా ఆయన ఎవరికీ అందుబాటులో లేరు. ప్రస్తుతం వేసవి విడిది కోసం జగన్ ఇతర ప్రాంతాలకు వెళ్లారని వైసీపీ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఎక్కడికెళ్లారో ఎవరికీ తెలియదు. పార్టీ కార్యక్రమాలను విజయసాయిరెడ్డి, ఇతర నేతలు పర్యవేక్షిస్తున్నారు. పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులతో ఇప్పటివరకు అధికారికంగా సమావేశం ఏర్పాటు చేయలేదు. ఓ వైపు లోక్ సభ నియోజకవర్గాల వారీగా టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమావేశాలు నిర్వహిస్తున్నా... జగన్ మాత్రం ఇలాంటి సమావేశాలు నిర్వహించడానికి అంతగా ఆసక్తి చూపడం లేదు. కొద్దిరోజులు ఫ్యామిలీతో కలిసి విహార యాత్రకు వెళ్లిన వైసీపీ అధినేత... ఆ తరువాత హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. పార్టీ ముఖ్యనేతలు, సన్నిహితులు మినహాయిస్తే... పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులు పెద్దగా ఆయనను కలవడం లేదు.
అయితే ఉన్నట్టుండి ఫలితాలు వెలువడటానికి రెండు రోజులు ముందు అంటే మే 21న పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులతో జగన్ సమావేశం ఏర్పాటు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. మే 21న సమావేశానికి హాజరుకావాలంటే ఇప్పటికే పార్టీ తరపున పోటీ చేసిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు సమాచారం అందింది. దీంతో ఆ రోజు జరగబోయే సమావేశం జగన్ ఏయే అంశాలపై మాట్లాడతారనే అంశంపై వైసీపీ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు మే 19న తుది విడత ఎన్నికలు పూర్తి కాగానే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు రానున్నాయి. లోక్ సభ స్థానాలతో పాటు ఏపీలో ఎవరు గెలుస్తారనే అంశంపై పలు మీడియా ఛానల్స్, సర్వే సంస్థలు 19న తమ అంచనాలను వెల్లడించనున్నాయి.