ఎన్నికలకు ముందు పాదయాత్రలో బీసీ డిక్లరేషన్, బీసీ గర్జన, బీసీ సబ్ ప్లాన్ అంటూ ఊదరగొట్టి ఆయా వర్గాల ఓట్లు కొల్లగొట్టి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి, నేడు బీసీల వెన్నెముకనే విరిచేయడానికి సిద్ధపడ్డాడని టీడీపీ నేత, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. నిన్న కోర్ట్ లు రిజర్వేషన్ లు కొట్టేయగానే, జగన్ లో ఏ మాత్రం బాధ లేదని, తనకు కావాల్సిందే జరిగింది అన్నటు, జగన్ వెంటనే మంత్రులు చేత బీసీలకు తగ్గించి 50 శాతంతో ఎన్నికలకు వెళ్తాం అని నిన్న సాయంత్రం చెప్పించారని, ఈ రోజు జగన్ స్వయంగా చెప్పారని, రేపు క్యాబినెట్ అంటున్నారని, ఎక్కడైనా కోర్ట్ లు కొట్టేస్తే, సుప్రీం కోర్ట్ కు వెళ్తారని, కాని జగన్ కు బీసీలు అంటే చులకన కాబట్టి, సుప్రీంకు వెళ్ళకుండా, బీసీల గొంతు కోస్తున్నారని అన్నారు. జగన్ నిర్లిప్తత, నిర్లక్ష్యం, ఉదాసీనత కారణంగానే 60.55 శాతం ఉండాల్సిన రిజర్వేషన్లకు 10 శాతం కోత పడిందని... తద్వారా 34 శాతం ఉండాల్సిన బీసీ రిజర్వేషన్లు 24 శాతానికే పరిమితమయ్యాయన్నారు. 1995 నుంచి 34 శాతం ఉన్న బీసీ రిజర్వేషన్లు జగన్ పాలనలో 24 శాతానికి తగ్గించబడ్డాయన్నారు. 25 సంవత్సరాల నుంచి అమలు లో ఉన్న బీసీ రిజర్వేషన్లు 24 శాతానికి తగ్గడానికి కారకుడైన జగన్మోహన్ రెడ్డి తక్షణమే బడుగు, బలహీన వర్గాలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని నిమ్మల డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ లు కొనసాగించలేని ముఖ్యమంత్రికి అధికారంలో ఉండే అర్హత లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
2010లో హైకోర్టు రిజర్వేషన్లలో కోత పెట్టినా వెనకడుగు వేయకుండా ముందుకెళ్లిన కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం సుప్రీం కోర్టు ద్వారా 60.55 శాతం రిజర్వేషన్లు అమలయ్యేలా చేసిన విషయాన్ని జగన్ గ్రహించాలన్నారు. బీసీలంటే జగన్ కు చిన్నచూపు ఉండబట్టే నేడు వారు రిజర్వేషన్లు కోల్పోయే పరిస్థితి వచ్చిందన్నారు. బీసీలు 10 శాతం రిజర్వేషన్లు కోల్పోయేలా కోర్టు తీర్పు రావడానికి జగనే ప్రధాన కారకుడన్నారు. హైకోర్టులో రిజర్వేషన్లపై వాదనలు జరిగేటప్పడు జగన్ ప్రభుత్వం అసమర్థులైన లాయర్లను నియమించబట్టే బీసీలకు వ్యతిరేకంగా తీర్పు వచ్చిందన్నారు. 70 శాతం జనాభా ఉన్న బీసీలకు న్యాయం చేయడం కోసం పేరు ప్రతిష్టలు గల న్యాయవాదులను ఎందుకు నియమించలేదో జగన్ సమాధానం చెప్పాలన్నారు. ప్రజల ధనాన్ని దుబారా చేయడంలో జగన్ ప్రభుత్వం నెంబర్ వన్ గా నిలిచిందన్న నిమ్మల, సచివాలయ, ఇతర ప్రభుత్వ భవనాలు, పాఠశాలలు, శ్మశానాలకు రంగులు వేయడానికి రూ. 13 వందల కోట్లను దుర్వినియోగం చేసిందన్నారు. తన ఇంటి మరమ్మత్తులకు కూడా కోట్లాది రూపాయల ప్రజా ధనాన్నే జగన్ దుబారా చేశాడన్నారు. తన కేసులకు సుప్రీం కోర్టు న్యాయవాది ముకుల్ రోహిత్గీ కి రూ. 5 కోట్లు ఇచ్చి పెట్టుకున్న జగన్, బీసీల రిజర్వేషన్ల కేసు విషయంలో మాత్రం ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ ని నియమించి చేతులు దులుపుకున్నాడని నిమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు.
రిజర్వేషన్ల అంశంలో ఓడిపోవాలన్న ఉద్దేశం ఉండబట్టే ప్రభుత్వ న్యాయవాది చిత్తశుద్ధితో పని చేయలేదన్నారు. రిజర్వేషన్ లు 50 శాతం దాటకూడదంటూ కోర్టుకు వెళ్లిన వారంతా తెలుగుదేశం పార్టీవారేనని అసత్య ప్రచారం చేసిన జగన్ అంతర్ ‘సాక్షి’ ప్రతాపరెడ్డి, రామాంజనేయులు అనే వ్యక్తులతో జగన్ కు ఉన్న సన్నిహిత సంబంధాల గురించి తెలుసుకుంటే మంచిదన్నారు. రాష్ట్ర రెడ్డి సంఘం అధ్యక్షుడైన ప్రతాప్ రెడ్డి రిజర్వేషన్లు తగ్గిస్తూ హై కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ ప్రకటన చేసిన వైసీపీ ప్రభుత్వంలోని పెద్దలు ఇంతవరకు ఎందుకు సమాధానం చెప్పలేదని నిమ్మల ప్రశ్నించారు. బోయరామాంజనేయులు రాప్తాడు మండల వైసీపీ కన్వీనర్ అని, అటువంటి వ్యక్తి బీసీలకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్ళింది వాస్తవమో కాదో వైసీపీ నేతలు, మంత్రులు సమాధానం చెప్పాలన్నారు. జగన్ ప్రోద్భలంవల్లే రామాంజనేయులు కోర్టులో బీసీల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా రెండు పిటిషన్లు (1143/2020 మరియు 604/2020) వేశాడన్నారు. (ఈ సందర్భంగా బోయ రామాజంనేయులు జగన్ తో దిగినఫొటోలను, శుభాకాంక్షలు చెబుతూ జగన్ పేరుతో వేసిన ప్లెక్సీల ఫొటోలను నిమ్మల విలేకరులకు చూపించారు).
తనపార్టీ వారితోనే బీసీల రిజర్వేషన్లు తగ్గించేలా కోర్టులో పిటిషన్లు వేసిన జగన్, బీసీలకు ఏం సమాధానం చెబుతాడో చెప్పాలన్నారు. 15వేల పదవులు బీసీలకు దక్కకుండా రామాంజనేయులు ద్వారా అడ్డుకున్నది జగన్మోహన్ రెడ్డేనన్నారు. జగన్ ఇంతచేస్తుంటే, బీసీ వర్గానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని నిమ్మల నిలదీశారు. బీసీలకు పెద్దపీట వేస్తామని డబ్బాలు కొట్టుకుంటున్న జగన్, రిజర్వేషన్లు తగ్గించడం ద్వారా వారిని కోలుకోలేని విధంగా దెబ్బతీశాడన్నారు. నిజంగా జగన్ కు బీసీల రిజర్వేషన్లపై చిత్తశుద్ధి ఉంటే, తమిళనాడు, కర్ణాటక మాదిరి రిజర్వేషన్లను షెడ్యూల్ లో చేర్చడానికి ఎందుకు ప్రయత్నించడం లేదన్నారు. సొంతకేసుల నుంచి బయటపడటానికి, అమరావతిని చంపేయడానికి, మండలిని రద్దుచేయడానికి ఢిల్లీ వెళ్లి లాబీయింగ్ చేసిన జగన్, బీసీల రిజర్వేషన్ల కోసం కేంద్రపెద్దలతో ఎందుకు లాబీయింగ్ చేయలేదని నిమ్మల నిలదీశారు.