ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుస పెట్టి దేవాలయాల పై జరుగుతున్న ఘటనలు అందరినీ కలవర పెడుతున్నాయి. అంతర్వేది ఘటన తరువాత, కొంచెం కుదుటు పడినట్టు అనిపించినా, రామతీర్ధంతో అది మరోసారి పరాకాష్టకు చేరింది. దాదాపుగా 140కు పైగా ఘటనలు జరిగాయి. ఇందులో అంతర్వేది, బిట్రగుంట, కనకదదుర్గమ్మ గుడి, రామతీర్ధం లాంటి పెద్ద పెద్ద ఆలయాలు ఉండటం, ఇవన్నీ ప్రభుత్వం ఆధీనంలో ఉండటం తెలిసిందే. అయితే ఏవో చిన్న చిన్న ఘటనలకు తప్పితే, ఇప్పటి వరకు దోషులను పట్టుకుంది లేదు. అయితే ఈ ఘటనలు ఎవరు ఎందుకు చేస్తున్నారో ఎవరికీ క్లారిటీ లేదు. ఈ కుట్ర చూస్తుంటే, మత చిచ్చు కోసం అని అర్ధం అవుతుంది. అయితే ఇన్నాళ్ళు అయినా, ప్రభుత్వం ఎవరినీ పట్టుకోలేక పోవటం హైలైట్. ఇంత పెద్ద యంత్రాంగం ఏమి చేస్తుందో ఎవరికీ అర్ధం కావటం లేదు. అయితే జరుగుతున్న ఘటనల పై ముఖ్యమంత్రి హోదాలో జగన్ చేసిన వ్యాఖ్యలు, అందరినీ షాక్ అయ్యేలా చేసాయి. ఎవరో చిన్న నాయకులో, ఎదో ఎమ్మెల్యే, ఎంపీలు చేసారు అంటే ఎవరూ పట్టించుకోరు కానీ, ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ, ఈ దాడులు ఆన్నీ చేస్తుంది తెలుగుదేశం పార్టీ అని జగన్ మోహన్ రెడ్డి తేల్చేసారు. మరి పోలీసులు ఎందుకు పట్టుకోవటం లేదు ? ఎందుకు తెలుగుదేశం నేతలను లోపల వేయటం లేదు ?
అయితే జగన్ చెప్పిన కారణం వింటే, మరింతగా అవాక్కవ్వాల్సిందే. ఒక తొమ్మిది సంఘటనలు చెప్తూ, ప్రభుత్వం ఏదైనా కార్యక్రమం మొదలు పెట్టిన ప్రతి సారి, ఈ ఘటనలు జరిగాయి అంటూ తొమ్మిది ఉదాహరణలు చెప్పారు. మా ప్రభుత్వానికి పబ్లిసిటీ రాకూడదు అనే ఉద్దేశంతోనే, తెలుగుదేశం పార్టీ ఇలా చేస్తుందని తేల్చేసారు. అయితే ఈ లాజిక్ లేని మాటలు ఏమిటో ఎవరికీ అర్ధం కాలేదు. పబ్లిసిటీ రాకుండా చేయటానికి, ఎక్కడో మారు మూల దేవాలయంలో విగ్రహం పగలుకొడతారా ? సరే ఈ తొమ్మిది ఘటనలు చెప్పారు, మరి మిగతా 130 సంఘటనలు ? రాష్ట్రంలో జరుగుతున్న అన్యమత ప్రచారం కూడా చంద్రబాబు చేస్తున్నారా ? ఇలా అనేక ప్రశ్నలు వస్తాయి. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి, ఇంత బాధ్యత లేకుండా, జరిగిన ఘటనలు మొత్తం తెలుగుదేశం బాధ్యత అని చెప్తే, పోలీసులు చేస్తున్న విచారణ పై, జగన్ మాటలు ప్రభావితం చూపవా ? సోషల్ మీడియాలో, వాట్స్ అప్ లలో, ఎవరో గలికి రాసుకునే మాటలు, ఒక ముఖ్యమంత్రి నోటి వెంట రావటం ఏమిటి ? అదీ ఇంత ముఖ్యమైన అంశం పై రావటం ఏమిటి ? జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పోలీస్ విచారణను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని, తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఆరోపిస్తున్నారు. ముఖ్యమంత్రి దగ్గర ఇంత స్పష్టమైన ఆధారాలు ఉంటే, పోలీసులు ఏమి చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.