గత రెండు సంవత్సరాలుగా, విశాఖలో భూ-కుంభకోణాలు జరిగిపోయాయని, వెంటనే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసి దర్యాప్తు చెయ్యాలని హడావిడి చేసారు. అయితే "సూది కోసం సోదికి వెళ్తే పాత రంకు బయటపడింది " అనే సామెత చందన, ఈ భూకుంభకోణం మొత్తం, కాంగ్రెస్ లోనే జరిగినట్టు తేలిపోయి, జగన్ మెడకే చుట్టుకుంది. రెండు రోజుల క్రితం, విశాఖలో భూరికార్డుల ట్యాంపరింగ్ పై విచారణ జరిపిన సిట్ కేబినెట్‌కు నివేదిక అందజేసింది. ఆ నివేదికలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేరు ఉంది. ఈయన గత ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. గత 15 ఏళ్లుగా జరిగిన భూ లావాదేవీలపై సిట్ విచారణ జరిపింది. ధర్మాన కుమారుడి పేరుమీద ఉన్న భూములపైనా ఆరోపణలు ఉన్నాయి.
విచారణ జరిపిన సిట్ ఇచ్చిన నివేదికలో ముగ్గురు కలెక్టర్లు, నలుగురు జాయింట్ కలెక్టర్ల పేర్లు ఉన్నాయి. 10 మంది డీఆర్వోలు, 14 మంది ఆర్డీవోల పేర్లు ఉన్నాయి. మొత్తంగా 100 మంది అధికారులపై క్రిమినల్, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సిట్ తన నివేదికలో సూచించింది. ఐఏఎస్, గ్రేడ్-1 స్థాయి అధికారుల ప్రమేయం ఉందని సిట్ నివేదికలో వెల్లడించింది. ఇందులో కొందరు అధికారులను సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అలాగే కొన్ని భూముల రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని సూచించింది. సిట్ నివేదిక పై తదుపరి చర్యలకు కేబినెట్ కమిటీని ఏర్పాటు చేసింది.
ఈ భూకుంభకోణంలో గత ప్రభుత్వాల భాగోతం బయటపడింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని మాజీ సైనికుల భూముల కొట్టేసిన బడా బాబులకు షాక్ తగిలింది. అప్పటి ఎన్ఓసీల రద్దుకు కేబినెట్ రంగం సిద్ధం చేస్తోంది. జగన్ ఆరోపించినట్టు, భూకుంభకోణంలో మంత్రి గంటా శ్రీనివాసరావుకు సంబంధించి ఒక్క ఆధారం కూడా సమర్పించ లేకపోయారని చెప్పింది. సీట్ నివేదికతో కిందిస్థాయి రెవెన్యూ సిబ్బంది పీకల దాకా మునిగింది. సిట్ నివేదికను మంగళవారం ఆమోదించిన మంత్రిమండలి... దానిని పరిశీలించి బాధ్యులపై ఎలాంటి చర్యలు చేపట్టాలి? అక్రమల లావాదేవీల్లో వేరేవారి పరమైన భూముల్ని ఎలా స్వాధీనం చేసుకోవాలన్న అంశంపై సిఫార్సులు చేసేందుకు రెవెన్యూ, సాధారణ పరిపాలన, న్యాయశాఖల కార్యదర్శులతో ఒక కమిటీని నియమించింది. నెల రోజుల్లోగా కమిటీ నివేదిక అందజేయాలని సూచించింది.