వైసిపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో దాడి జరిగింది. ప్రస్తుతం విజయనగరం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్, రేపు శుక్రవారం కావటంతో అక్రమాస్తుల కేసులో రేపు నాంపల్లిలోని న్యాయస్థానంలో హాజరుకావాల్సి ఉంది. దీంతో హైదరాబాద్ వెళ్లేందుకు ఈ రోజు ఉదయం కొంచెం సేపు తిరిగి, హైదరబాద్ బయలుదేరారు జగన్. దీని కోసం ఆయన విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానం బయలుదేరేందుకు సమయం ఉన్నందున వీఐపీ లాంజ్‌లో ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఓ వెయిటర్ ఫోర్క్‌తో జగన్ పై దాడి చేశాడు. ఈ ఘటనతో విమానాశ్రయ సిబ్బంది షాక్‌కు గురయ్యారు.
అయితే వెంటనే తేరుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు. స్థానిక పోలీసులకు సమాచారం అందించి నిందితుడిని వారికి అప్పగించారు. జగన్‌కు వెంటనే చికిత్స అందించారు. ఈ దాడిలో జగన్ భుజానికి స్వల్ప గాయమైనట్లు తెలుస్తోంది. ఈ ఘటన జరిగిన వెంటనే విమానాశ్రయంలోని ప్రవేశించే మార్గాన్ని పోలీసులు మూసివేశారు. లోనికి ఎవరినీ రాకుండా అడ్డుకుంటున్నారు. జగన్‌పై దాడి సమాచారం తెలుసుకున్న వైకాపా నేతలు పెద్దయెత్తున విమానాశ్రయానికి చేరుకుంటున్నారు. స్థానిక ఏసీపీ హుటాహుటిన విమానాశ్రయానికి చేరుకుని సంఘటనపై వివరాలు తెలుసుకున్నారు.
దాడికి పాల్పడిన నిందితుడి వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే ఆ వ్యక్తి కత్తితో లోపలకి ఎలా వచ్చాడు అనే దాని పై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ అంతా సెంట్రల్ ఫోర్సెస్ ఆధినీంలో ఉంటుంది. లోకల్ ఏపి పోలీసు ఎవరూ అక్కడ ఉండరు. ఇవన్నీ చూస్తుంటే, ఎమన్నా కుట్ర ఉందా, ఆపరేషన్ గరుడలో ఒక భాగమా అనే చర్చ కూడా జరుగుతుంది. అసలు ఆ కత్తి లోపలకి వెళ్తుంటే, అక్కడ ఎయిర్ పోర్ట్ సెంట్రల్ సెక్యూరిటీ ఏమి చేస్తుంది అనే చర్చ కూడా జరుగుతుంది. ఏది ఏమైనా, ఇలాంటి భౌతిక దాడులను ఎవరైనా ఖండించాలి. పోలీసు ఎంక్వయిరీలో అన్ని విషయాలు బయటకు రావాలని కోరుకుందాం...