వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించాక ఆయనపై ఓ పుకారు షికారు చేసింది. పలువురు వైసీపీ అభిమానులు కూడా ఆ ప్రచారానికి సంబంధించిన సమాచారాన్ని ఫేస్‌బుక్‌లో విస్తృతంగా షేర్ చేశారు. అయితే.. అది కేవలం పుకారు మాత్రమేనని స్పష్టమైంది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. వైఎస్ జగన్ పార్టీ ఏపీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత సోషల్ మీడియాలో ఓ సరికొత్త ప్రచారం సాగింది. క్రైస్తవ మతాన్ని అనుసరించే జగన్ హిందూ మతంలోకి మారారని, కావాలంటే ఈ వీడియో చూడండి అంటూ ఓ వీడియోను కొందరు విస్తృతంగా ప్రచారం చేశారు.
అయితే.. ఈ ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదని, అది పూర్తిగా తప్పుడు ప్రచారం అని తేలింది. ఆ వీడియో 2016లో స్వరూపానంద సరస్వతితో కలిసి జగన్ పూజలు చేసిన సందర్భంలో రికార్డ్ చేసిందని స్పష్టమైంది. 2016, ఆగస్ట్ 10న రిషికేష్‌లో జగన్ గంగానదిలో పవిత్ర స్నానం ఆచరించి, స్వరూపానంద సరస్వతి సమక్షంలో పూజలు చేశారు. అనంతరం అక్కడే ఉన్న పండితులకు, మునులకు అన్నదానం చేశారు. ఆ సందర్భంలో జగన్ మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా రావాలని, ప్రజలు సంతోషంగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ పూజలు చేసినట్లు చెప్పారు. అప్పటి వీడియోను ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచారం చేసినట్లు తేలింది. తాజాగా ఆయన ఓ జాతీయ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా కాంగ్రెస్ పార్టీతో గతానుబంధం గురించి అడిగిన సందర్భంలో తాను ప్రార్థన చేస్తానని, బైబిల్ చదువుతానని చెప్పారు. ఆ దేవుడే నిర్ణయిస్తాడని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో ఆయన మతం మారలేదన్న విషయం స్పష్టమైంది.