జగన్ సర్కారుపై తెలుగుదేశం పార్టీ వ్యూహం మార్చుకుంది. తొలుత కొత్త ప్రభుత్వానికి 6 నెలలు గడువు ఇవ్వాలని ఆ పార్టీ భావించింది. అయితే టీడీపీ కార్యకర్తలపై వైసీపీ దాడులు చేస్తుండడంతో సర్కారుపై తక్షణమే పోరాటం చేయాలని నిర్ణయించింది. ఇవ్వాల్టి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో దాడులను ప్రస్తావించి వైసీపీ తీరును ఎండగట్టాలని డిసైడయింది. సంఖ్యాబలం తక్కువగా ఉన్నా.. ప్రజల సమస్యలపై సభలో పోరాటం చేయాలని టీడీపీ నేతలకు సూచించారు అధినేత చంద్రబాబు. నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతుండడంతో ఎలా ముందుకు వెళ్లాలి అన్నదానిపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆయన భేటీ అయ్యారు. శాసనసభలో తమకు 23మంది సభ్యులు ఉన్నా ప్రభుత్వాన్ని నిలదీయడంలో అందరూ ముందు ఉండాలని పిలుపు ఇచ్చారు. మండలిలో 35మంది సభ్యుల బలం ఉన్నందున అక్కడ మరింత క్రీయాశీలకంగా వ్యవహరించాలని దిశానిర్దేశం చేశారు.
ఉభయసభల్లోనూ పార్టీ సభ్యులకు పదవులను ఖరారు చేశారు చంద్రబాబు. శాసనసభలో టీడీపీ పక్షనేతగా చంద్రబాబే వ్యవహరించనుండగా.. ఉపనేతలుగా అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడును నియమించారు. విప్‌గా వీరాంజనేయ స్వామి ఉంటారు. శాసన మండలిలో పార్టీ పక్ష నేతగా యనమల రామకృష్ణుడు, ఉప నేతలుగా డొక్కా మాణిక్యవర ప్రసాద్, సంధ్యారాణి, గౌరువాని శ్రీనివాసును నియమించారు. మండలి విప్ గా బుద్దా వెంకన్నను ఎంపిక చేశారు. టీడీపీ శాసనసభాపక్ష కోశాధికారిగా మద్దాలి గిరి కొనసాగుతారు. ప్రస్తుత శాసనసభా సమావేశాల్లో వివిధ అంశాలు చర్చకు రానప్పటికీ గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడే అవకాశం వస్తుంది. అప్పుడు ప్రస్తావించాల్సిన అంశాలను చంద్రబాబు నేతలతో చర్చించారు. తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు ఇవ్వాల్సిన 15 వేల రూపాయల పెట్టుబడి సాయాన్ని రద్దు చేసి 12,250 మాత్రమే ఇవ్వడంపై అభ్యంతరాలు లేవలెత్తనున్నారు.
గత 15 రోజులుగా టీడీపీ నేతలపై వైసీపీ చేస్తున్న దాడుల అంశాన్ని సభలో ప్రస్తావించి శాంతి భద్రతల పరిరక్షణ బాధ్యతను కొత్త ప్రభుత్వానికి గుర్తు చేయాలని తెలుగుదేశం భావిస్తోంది. అలాగే తమ పార్టీ నాయకులపై అవినీతి బురద జల్లితే సమర్ధంగా తిప్పి కొట్టాలని డిసైడయింది. తప్పుడు కేసులు బనాయించినా, అవమానాలకు గురిచేసినా, వాటన్నింటిని ఎదుర్కోవాలని చంద్రబాబు నేతలకు దిశానిర్దేశం చేశారు. ఏ తప్పు చేయనప్పుడు భయపడాల్సిన పనిలేదని ఆయన స్పష్టం చేశారు. సహేతుకంగా నిర్మాణత్మక విమర్శలతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాటలన్నారు. . ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమన్వంతో పనిచేయాలని హితబోధ చేశారు. అసెంబ్లీ సమావేశాలు ఇవ్వాలే ప్రారంభం కానుండడంతో టీడీపీ ఎమ్మెల్యేలు పసుపు చొక్కాలతో హాజరు కానున్నారు. ఉదయం అధినేత చంద్రబాబు నివాసానికి చేరుకొని, అక్కడి నుంచి వెంకటపాలెం వెళ్లి ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించి అసెంబ్లీకి వెళ్తారు.