ఎప్పుడో ఏడాది క్రితం, ఢిల్లీలో ప్రధాని మోడీని కలిసి, మీడియా సమావేశం పెట్టిన జగన్, ఇప్పుడు మళ్ళీ ప్రెస్ మీట్ పెడుతున్నారు. రాష్ట్రంలో అరాచకం జరుగుతూ ఉంటే, ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకుని, ఈ అరాచకానికి సహకారం అందించిన అధికారుల పై, ఈసీ చర్యలు తీసుకుంది. అలాగే, కరోనా దేశంలో విస్తరిస్తూ ఉండటం, పక్కన ఉన్న తెలంగాణా ఎమర్జెన్సీ పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల వాయిదా, అధికారులని సస్పెండ్ చెయ్యటం పైవైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా ప్రభావంతో ఎన్నికలు వాయిదా వేశారని చెప్పడాన్ని ప్రభుత్వం విశ్వసించట్లేదని సమాచారం. గవర్నర్ బిశ్వభూషణ్‌తో ముఖ్యమంత్రి జగన్ సమావేశమయ్యారు. ఆరు వారాల పాటు స్థానిక ఎన్నికల వాయిదా సందర్భంగా ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే గవర్నర్ తో ఏమి చర్చించారు, ఎన్నికల కమిషన్ పై ఫిర్యాదు చేసారా అనే దాని పై తెలియాల్సి ఉంది. అయితే ఎప్పుడూ లేనిది జగన్ ఎందుకు మీడియా సమావేశం పెడతారో, ఏమి చెప్తారో చూడాలి.
రాజకీయ పోరాటంతోనే స్థానిక ఎన్నికల ప్రక్రియ వాయిదా పడిందని తెదేపా నేత అచ్చెన్నాయుడు అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అప్రజాస్వామిక పరిస్థితులే ఎన్నికల వాయిదాకు కారణమన్నారు. స్థానిక ఎన్నికల ప్రక్రియను వాయిదా పడడం రాజకీయ పోరాటల ఫలితమేనని మాజీ మంత్రి, తెదేపా నేత అచ్చెన్నాయుడు శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో అన్నారు. ఎన్నికల వాయిదాకు కరోనా అని ఎన్నికల కమిషన్ అంటున్నా... రాష్ట్రంలోని అప్రజాస్వామిక విధానాలేనని అభిప్రాయపడ్డారు. ఇలా ఎన్నికలను మధ్యలో వాయిదా వేయడమనేది దేశ చరిత్రలోనే ఇదే ప్రథమమన్నారు. ఎన్నికల ప్రక్రియను మొత్తం రీషెడ్యూల్ చేయాలని తెలుగుదేశం పార్టీ ఎన్నికల సంఘాన్ని కోరింది. నామినేషన్ల ప్రక్రియలో అధికార పార్టీ బెదిరింపులకు పాల్పడిందని ఆరోపించారు. తమ పార్టీ అభ్యర్థులు చేసిన ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలని కోరారు. మాచర్ల ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల ప్రక్రియను మొత్తం రీషెడ్యూల్ చేయాలని తెదేపా డిమాండ్ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో తెదేపా అభ్యర్థులను నామినేషన్లు దాఖలు చేయనివ్వలేదని ఆరోపించారు. విజయవాడలో ఆ పార్టీ ఎమ్మెల్సీలు దీపక్ రెడ్డి, అశోక్‌బాబు, బుద్దా వెంకన్న మీడియాతో మాట్లాడారు. వైకాపా ఉచ్చులో కొందరు అధికారులు పడ్డారని ఆరోపించారు. వారిపై విచారణ చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. తప్పు చేసిన అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. డోన్, మాచర్లలోనూ తమ పార్టీ అభ్యర్థులను నామినేషన్ వేయనివ్వలేదని దీపక్ రెడ్డి అన్నారు. నామినేషన్ విత్‌డ్రా చేసుకోవాలని బెదిరిస్తున్నారని అన్నారు. తాము చేసిన ఫిర్యాదులు అన్నింటిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. అవసరమైనతే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని, న్యాయస్థానాలను కూడా ఆశ్రయిస్తామని చెప్పారు.