దారుణ హత్యకు గురైన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి పేరిట ఓ లేఖ పెద్ద దుమారం తీసుకువస్తోంది. కారు డ్రైవరు ప్రసాద్ తనను చచ్చిపోయేట్లు కొట్టాడని వివేకా పేరుతో రాసిన లేఖను ఆయన బంధువులు శుక్రవారం సాయంత్రం పోలీసులకు అందించారు. ఇదే లేఖపై జగన్ స్పందిస్తూ గొడ్డలితో నరికి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతన్న వ్యక్తి ఎలా ఈ లేఖ రాయగలుగుతారని ప్రశ్నించారు. కారు డ్రైవరు ప్రసాద్, రాజారెడ్డి హత్య కేసులో నిందితుడు ఆర్.సుధాకర్‌రెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ లేఖను పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపి అసలు వైఎస్ వివేకానే ఈ లేఖ రాశాడా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. గురువారం రాత్రి 11.30గంటలకు కారు డ్రైవరు ప్రసాద్ వివేకాను ఆయన నివాసంలో వదలి వెళ్లిపోతుండగా భోజనానికి డబ్బులివ్వగా తాను ఇంట్లోనే భోంచేస్తానని వెళ్లిపోయాడు. ఉదయం 5.30 గంటలకు పీఏ కృష్ణారెడ్డి వచ్చారు. 6.30గంటల ప్రాంతంలో వాచ్‌మేన్ వెనుక వైపు తలుపు తీసిన విషయాన్ని గుర్తించి కృష్ణారెడ్డికి వివరించారు. ఇద్దరూ వెళ్లి చూడగా బాత్రూంలో వివేకా విగత జీవుడై కనిపించాడు. అప్పుడే గుండెనొప్పితో కుప్పకూలిపోయి దెబ్బలు తగలడంతో రక్తస్రావమై వివేకా చనిపోయాడని బంధువులే పప్రాథమికంగా నిర్ధరించారు. బెడ్రూములో రక్తపు మరకలను కడిగేసినట్లు పోలీసులు గుర్తించారు.
పోలీసులకు 6.40 గంటలకు సమాచారం రావడంతో సీఐ శంకరయ్య సంఘటన స్థలానికి చేరే సమయానికే రక్తాన్ని తుడుస్తూ కనిపించడంతో ఆయన ఇలా చేయకూడదంటూ అడ్డు తగిలారు. పోస్టుమార్టం నిర్వహించే వరకు అందరిలోనూ హఠాన్మరణం చెందినట్లుగా ప్రచారం సాగుతూ వచ్చింది. డాక్టర్లు పోస్టుమార్టం చేసేందుకు మృతదేహాన్ని పరిశీలించినప్పుడు తలపై బలమైన గాయాలు, ఒళ్లంతా గొడ్డలితో నరికిన గాట్లు కనిపించాయి. అప్పుడే హత్యకు గురైన సంఘటన వెలుగులోకి వచ్చింది. సాయంత్రం వరకు హైడ్రామా కొనసాగుతూ వచ్చింది. డీఐజీ, ఎస్పీతో పాటు క్లూస్‌టీం, జాగిలాలు తదితర విచారణ బృందాలన్నీ తరలివచ్చాయి. అనుమానాస్పద మృతిగా మొదట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కానీ హత్య జరిగినట్లుగా పోస్టుమార్టం సమయంలోనే తేలింది. ఈ హత్య వెనుక ఎవరున్నారు, ఎందుకు జరిగింది, ఏవైనా ఆర్థిక లావాదేవీలా, కుటుంబ కలహాలా, లేదా ఇతర వ్యవహారాలా అన్న చర్చ జోరుగా సాగుతూ వచ్చింది. 5గంటలకు జగన్ పులివెందులకు విచ్చేసి వివేకా భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. గంట తరువాత మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పది నిమిషాల ముందు వివేకానందరెడ్డి బంధువులు డీఎస్పీ నాగరాజును కలిసి ఇంట్లో ఈ లేఖ దొరికిందంటూ ఓ లేఖ అందించారు. ఆ లేఖలో రక్తపు మరకలు ఉన్నాయి.
‘నా డ్రైవరు నేను డ్యూటీకి తొందరగా రమ్మన్నానని చచ్చేలా కొట్టినాడు. ఈ లెటరు రాసేకి చాలా కష్టపడ్డాను. డ్రైవరు ప్రసాద్‌ను వదలి పెట్టవద్దు. ఇట్లు వివేకానందరెడ్డి’ అని ముగింపు పలికారు. ఈ లెటరు అందుకున్న పోలీసులు కారు డ్రైవరు ప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నారు. పులివెందులకు చెందిన ప్రసాద్ ఒకటిన్నర నెలగా కారు డ్రైవరుగా వివేకాకు సేవలందిస్తున్నాడు. గురువారం రాత్రి 11.30కు ఇంటి వద్ద వదలిన ప్రసాద్ తిరిగి ఎప్పుడొచ్చాడన్నది అంతుచిక్కని ప్రశ్న. జగన్ చెప్పినట్లు గొడ్డలితో దారుణంగా నరకడంతో తీవ్ర గాయాలపాలైన వివేకా లెటరు రాసే పరిస్థితిలో ఉన్నాడా అనేది సందేహమే. మరి వివేకా బంధువులే ఈ లెటరును తీసుకువచ్చి పోలీసులకు అందించడం వెనుక అంతరార్థం ఏమిటన్నది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. ఉదయం గుండెనొప్పితో చనిపోయారని చెప్పడం, ఆ తరువాత పోస్టుమార్టానికి తరలించే సమయంలోనే గొడ్డలితో నరికినట్లు గుర్తించారు. బెడ్రూంలో ఉన్న రక్తపు మరకలు తుడవడం ఇవన్నీ కూడా పోలీసులు వచ్చే లోపే వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోంది. వైఎస్ రాజారెడ్డి హత్యలో ముద్దాయిగా జైలు జీవితం అనుభవించి ఇటీవలే విడుదలైన రాగిపిండి సుధాకర్‌రెడ్డికి ఈ హత్యలో ప్రమేయం ఉందన్న ఆలోచనలతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా పోలీసులే డ్రామా ఆడుతున్నారంటూ హత్యను గుండెనొప్పితోనే చనిపోయాడని సృష్టించే ప్రయత్నం జరిగిందని, ఈ ప్రభుత్వం ఈ పోలీసులపై నమ్మకం లేదని జగన్ ఆరోపిస్తూ సీబీఐ లేదా థర్డ్ పార్టీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఈ కేసును సవాల్‌గా తీసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. కర్నూలు డీఐజీ, జిల్లా ఎస్పీలు పర్యవేక్షిస్తూ అన్ని కోణాల్లో దర్యాప్తు సాగిస్తున్నారు. ఒకటి, రెండురోజుల్లో ఈ హత్య వెనుక ఉన్నది ఎవరు, ఎందుకు జరిగింది అన్నది తేలనుంది. సంఘటట జరిగి వెలుగులోకి వచ్చిన 12 గంటల తరువాత లేఖను బయట పెట్టి వివేకా రాసినట్లుగా చెప్పడంలో కూడా ఏదో మతలబు దాగి ఉందని పోలీసులు పేర్కొంటున్నారు.