తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్‌తో వైకాపా అధినేత జగన్ స్నేహం అంశం ప్రస్తుతం రాయలసీమలో చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరి మైత్రి ఓట్ల పంట పండిస్తుందా అన్న చర్చ జోరందుకుంది. అయితే కేసీఆర్‌తో స్నేహం జగన్‌కు నష్టం చేకూరుస్తుందని రాజకీయ విశే్లషకులు అభిప్రాయపడుతున్నారు. ఆంధ్రులను అసభ్య పదజాలంతో దూషించిన కేసీఆర్‌ను సీమ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అదే విధంగా పోతిరెడ్డిపాడు, ఆర్డీఎస్, తెలంగాణలో కర్నూలు, అనంతపురం జిల్లాలను కలవకుండా అడ్డుకున్నారన్న కారణంగా రాయలసీమలోనూ కేసీఆర్‌కు వ్యతిరేక పవనాలు ఉన్నాయని విశే్లషకులు వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో రాయలసీమలో బలంగా ఉన్న వైకాపా అధినేత జగన్ ఆ పట్టును నిలుపుకుంటారా అన్న ప్రశ్నకు కేసీఆర్‌తో జత కట్టడం జగన్‌కు నష్టమేనని వ్యాఖ్యానిస్తున్నారు.
రాష్ట్ర విభజన సమయంలో పోతిరెడ్డిపాడు, ఆర్డీఎస్, హంద్రీ-నీవా కాలువలు మూసివేయాలని డిమాండ్ చేసిన కేసీఆర్ విభజన చివరి దశలో కర్నూలు, అనంతపురం జిల్లాలను కలిపి తెలంగాణ ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌కు సైతం వ్యతిరేకంగా మాట్లాడిన విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు జగన్‌తో ఏ రకంగా స్నేహం చేసినా ఆ ప్రభావం వైకాపాపై ఖచ్చితంగా ఉంటుందని వారంటున్నారు. గత కొంతకాలం వరకు బీజేపీతో లోపాయికారీ ఒప్పందం ఉందని ప్రతిపక్ష పార్టీలు ఎన్ని ఆరోపణలు చేసినా వైకాపాపై ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత కనిపించలేదని, అయితే తాజాగా కేటీఆర్ జగన్ చర్చలు, భవిష్యత్తులో కలిసి ముందడుగు వేయడానికి సంకేతాలు ఇవ్వడం వంటి చర్యల నేపథ్యంలో జగన్ తీరుపై సీమ ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని వారంటున్నారు. విభజన సమయంలో ఏం మాట్లాడినా పట్టించుకోని జనం ఇటీవలి తెలంగాణ ఎన్నికల సమయంలో పోతిరెడ్డిపాడు, హంద్రీ-నీవా, ఆర్డీఎస్ వంటి ప్రాజెక్టులపై వ్యతిరేకత ప్రదర్శిస్తూ రాయలసీమ నేతలను వ్యక్తిగతంగా దూషించడాన్ని తప్పుబడుతున్నారని స్పష్టం చేస్తున్నారు.
రాయలసీమకు వరప్రసాదినిగా ఉన్న మూడు ప్రధాన ప్రాజెక్టుల విషయంలో భవిష్యత్తులో కేసీఆర్, నరేంద్ర మోదీ ఒత్తిడితో జగన్ మెత్తబడితే రాయలసీమకు తీరని నష్టం జరుగుతుందని ప్రజలు భావిస్తున్నారని విశే్లషకులు పేర్కొంటున్నారు. గతంలో చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టులను పట్టించుకోకపోయినా గత నాలుగేళ్లలో వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి హంద్రీ-నీవా, ఎస్‌ఆర్‌బీసీ, గాలేరు-నగరి కాలువల నిర్మాణ పనులను దాదాపుగా పూర్తి చేయించగలిగారని వారు వెల్లడిస్తున్నారు. దీని వల్ల అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల్లోని రైతుల్లో ఆనందం కనిపిస్తోందని, అయితే ఈ నీరు చంద్రబాబుకు ఓట్ల రూపంలో ప్రతిఫలాన్ని ఇస్తుందో లేదో కానీ జగన్, కేసీఆర్ స్నేహంతో సీమ ప్రజలు చంద్రబాబుకు మద్దతు తెలిపే అవకాశాలు మెరుగవుతాయని వారంటున్నారు. నరేంద్ర మోదీ, కేసీఆర్, జగన్ ఒకే నావలో పయనిస్తున్నారన్న టీడీపీ విమర్శలకు జగన్ బలాన్నివ్వడమే ఇందుకు కారణమని వారంటున్నారు.