ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ వైసీపీ ప్రలోభాల పర్వం మరింత ఊపందుకుంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వైసీపీ నేతలు విచ్చలవిడిగా నగదు, మందు పంపిణీ చేస్తున్నారు. విజయనగరం జిల్లా, పార్వతీపురంలో జగన్ సభకు వచ్చిన వారికి విచ్చలవిడిగా మద్యం, డబ్బు పంపిణీ చేయడమే ఇందుకు నిదర్శనం. ఈ పంపిణీ కార్యక్రమంలో కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో వ్యవహారం ఏబీఎన్ చేతికి చిక్కింది. టీడీపీ ప్రలోభాలకు లొంగొద్దని, తాము అధికారంలోకి వస్తే బెల్టు షాపుల తాట తీస్తామని, మద్యం నియంత్రణ చేస్తామని జగన్ పదే పదే చెబుతున్నారు. కానీ ఇందుకు విరుద్ధంగా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారు. జగన్ సభ కోసం మందు పంపిణీ చేసి జనాన్ని తరలిస్తున్నారు. వైసీపీ టోపీలు పెట్టుకుని, కండువాలు వేసుకుని, పార్టీ జెండాలు పట్టుకుని తాగి ఊగిపోయారు. అయితే నగదు పంపిణీలో తేడా రావడంతో కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. వచ్చినందుకు ఇస్తామన్నంత డబ్బులు ఇవ్వకపోవడం అన్యాయమని కిందిస్థాయి కార్యకర్తలు నిలదీశారు. దీంతో ఈ వ్యవహారం రోడ్డున పడింది.
కృష్ణా జిల్లాలో కూడా ఇదే వ్యవహారం రిపీట్ అయ్యింది. ద్విచక్ర వాహనాల ర్యాలీకి వచ్చిన వారికి డబ్బులు పంచుతూ వైసీపీ నేతలు అడ్డంగా బుక్కయ్యారు. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం నందివాడ మండలంలో వైసీపీ ద్విచక్ర వాహన ర్యాలీని నిర్వహించింది. ఈ సందర్భంగా ర్యాలీకి వచ్చిన వారికి వైసీపీ నేతలు డబ్బులు పంచారు. ఈ వ్యవహారం కాస్తా కెమెరా కంటికి చిక్కింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. మరోవైపు, డబ్బుతో ఓటర్లను ప్రలోభపెడుతున్నారంటూ వైసీపీపై ఇతర రాజకీయ పార్టీలు మండిపడుతున్నాయి. ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నాయి.
కొన్ని రోజుల క్రిందట ప్రకాశంలో కూడా ఇదే సీన్. ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గంలో ఈ దృశ్యాలు కనిపించాయి. వైసీపీ తరుపున ప్రచారంలో పాల్గొనే వారికి భారీ మొత్తంలో డబ్బులు ముట్టచెబుతున్నారంటూ ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. గంట పాటు జెండా పట్టుకుని వైసీపీ తరుపున ప్రచారంలో పాల్గొంటే రూ. 2000 ఇస్తామని కాంట్రాక్ట్ కుదుర్చుకుంటున్నారట. అంటే రోజుకు ఓ కార్యకర్త మూడు గంటల పాటు ప్రచారంలో పాల్గొంటే ఏకంగా ఆరువేల రూపాయలు వైసీపీ నేతలు ముట్టచెబుతున్నారు. ప్రచారానికి వచ్చిన వారికి వైసీపీ నేతలు డబ్బులు పంచుతున్న వీడియోలు బయటకు వస్తున్నాయి. కార్యకర్తలకు డబ్బులివ్వడంతో పాటు సిప్టుల వారిగా ప్రచారానికి తీసుకెళ్తున్నారు. ఒక కార్యకర్తకు గంటకు రెండు వేల రూపాలిస్తుంటే... రాష్ట్రం మొత్తం మీద ఎంతమంది ప్రచారంలో పాల్గొంటున్నారు... వాళ్లకు ఎంత సొమ్ము ముట్టచెబుతున్నారనేది ఇప్పడు సంచలనంగా మారింది.