తిరుపతిలోని రుయాఆసుపత్రిలోజరిగిన ఘటనకు సంబంధించిన వాస్తవాలను బయటపెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని, నిన్న ఘటన జరిగే సమయానికి ఎందరు రోగులుఆసుపత్రిలోఉన్నారు... అక్సిజన్ సరఫరాపై ఆధారపడి ఎందరు రోగులున్నారు...వారిలో ఎందరు చనిపోయారనే పూర్తి వివరాలను ప్రభుత్వం తక్షణమే బహిర్గతం చేయాలని టీడీపీ రాష్ట్ర అధికారప్రతినిధి మద్దిపట్ల సూర్యప్రకాశ్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే మీకోసం...! ఘటనపై ముఖ్యమంత్రి ఏదో ఆరాతీశాడన్నట్లు రాత్రి ప్రసార మాథ్యమాల్లో వచ్చింది. రాష్ట్రం అల్లకల్లోలమవుతుంటే తనకేదో అనారోగ్యం ఉన్నట్లు ఆరోగ్యశాఖా మంత్రి నటిస్తున్నాడు. ఆయనేమో రుయా ఆసుపత్రి సూపరింటెండ్ కి ఫోన్ చేసి మాట్లాడినట్టు చెబుతున్నారు. నిన్న ఉదయమే ఆసుపత్రిలో ఎంతవరకు ఆక్సిజన్ నిల్వలున్నాయి... ఎందరు రోగులున్నారు..ఉన్నవారికి ఆక్సిజన్ సరిపోతుందా లేదా అనేదానిపై రుయా ఆసుపత్రి సిబ్బంది ఎందుకు దృష్టిసారించలేదు? ప్రభుత్వం మొద్దునిద్ర పోవడంవల్లే ఇంతటి దారుణ ఘటన జరిగింది. రాత్రే కలెక్టర్ ఘటనా స్థలికి వెళ్లి, 11మంది చనిపోయారని చెప్పాడు. కొన్ని పత్రికలు, న్యూస్ ఛానళ్లవారేమో రాత్రంతా అక్కడే ఉండి దాదాపు 22మంది చనిపోయినట్టు చెప్పారు. ఇటువంటి అనేక సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యతప్రభుత్వంపై ఉందా లేదా? జరిగిన హ-త్య-ల-కు ప్రభుత్వం కారణమా...కాదా? ఇంతవరకు రాష్ట్రంలో అనేక ఘటనలు ఇదేమాదరి జరిగాయి. విజయనగరంలో తొలి ఘటన జరిగినప్పుడే, ప్రభుత్వం మేల్కొని ఉంటే, నిన్న రుయా ఘటనజరిగేదా? ప్రభుత్వ మొద్దునిద్ర, పాలకులు నిర్లక్ష్యం వల్లే నిన్న రుయా ఆసుపత్రిలో మరణాలు సంభవించాయి. నిన్నేమో ప్రభుత్వ ప్రత్యేకసలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఏదేదో చెబుతున్నాడు. ప్రజలప్రాణాలు కాపాడమని ప్రతిపక్షం మొత్తుకుంటుంటే, ప్రతిపక్షనేతలపై కేసులుపెట్టండి..చంద్రబాబుపై కేసులు పెట్టండంటూ, తీవ్రమైన నిరాశానిస్పృహలతో సజ్జల మాట్లాడుతున్నాడు.
ప్రతిపక్షనేతలపై, పత్రిలకవారిపై రాజద్రోహం కింద కేసులు పెడతారా? సజ్జల రామకృష్ణారెడ్డిని సలహాదారుగా నియమించి 24నెలలు అవుతోంది. ఈ 24నెలల్లో ఆయనిచ్చిన సలహాలు ప్రభుత్వానికి, ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడ్డాయి. ఆయనగానీ, ముఖ్యమంత్రి గానీ ప్రజల ఆరోగ్యంపై తొలినుంచీ శ్రద్ధ పెట్టిఉంటే, నిన్న రుయా ఘటన జరిగేదా? విజయనగరం ఘటన జరిగినప్పుడే, సజ్జల మంచి సలహాలు ఇచ్చిఉంటే, నిన్న అంతమంది చనిపోయేవారా? ప్రతిపక్షనేతలపై, పత్రికలపై కేసులు పెట్టాలంటున్న సజ్జల, నిన్న జరిగిన ఘటనపై ఎవరిమీద కేసులు పెడతాడో సమాధానం చెప్పాలి. ప్రజల చావులకు కారణమవుతున్న ముఖ్యమంత్రిపై కేసులుపెట్టాలా? లేక ఆయనకు సలహాలిస్తున్న సజ్జలపై పెట్టాలా? తనకేమీ సంబంధంలేదన్నట్లు వ్యవహరిస్తున్న ఆరోగ్యశాఖామంత్రిపై కేసు పెట్టాలా? లేక రుయాఆసుపత్రి సిబ్బందిపై పెట్టాలో సజ్జ లే చెప్పాలి. వ్యాక్సిన్లకోసం ప్రజలను చంద్రబాబు భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని సజ్జల ఏదేదో మాట్లాడుతున్నాడు. ఈరోజుకి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు లక్షమందికి రెండోవిడత వ్యాక్సిన్లు ఇవ్వాలి. ఎన్ని వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి... రోజుకి ఎందరికి వ్యాక్సిన్లు వేస్తున్నారనే సమాచారాన్ని ప్రభుత్వం ఎందుకు బహిర్గతం చేయడంలేదని ప్రశ్నిస్తున్నా. క-రో-నా రెండోదశ ఆరంభమైనప్పటినుంచీ ఆక్సిజన్ లేక, పడకలు దొరక్క, వెంటిలేటర్లు లేక చెట్లకింద, రోడ్లపైన, బస్టాండ్ లలో రోగులు చనిపోతున్నారు. అటువంటి దుస్థితి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వంకాదా?
క-రో-నా రెండోదశ మొదలైనప్పటినుంచీ సంభవించిన మరణాలకు ముఖ్యమంత్రిని, సజ్జల రామకృష్ణారెడ్డిని, ఆరోగ్యశాఖామంత్రిని బాధ్యులను చేసి, వారిపైనే హ-త్యా-య-త్నం కేసులుపెట్టాలి. రుయా ఘటనలో సంభవించిన మరణాలపై ప్రభుత్వం, ముఖ్యమంత్రే బాధ్యత తీసుకోవాలి. ప్రభుత్వపెద్దలు, ముఖ్యమంత్రి, మంత్రులు అందరూకూడా స్పైడర్ సినిమాలో విలన్ పాత్రధారిలా చావులను చూసి ఆనందిస్తున్నారు. ప్రజలు చస్తే ఛస్తారులే తమకేం సంబంధమన్నట్లు ముఖ్యమంత్రి, ప్రభుత్వపెద్దలు వ్యవహరిస్తున్నారు. రుయా ఆసుపత్రి రికార్డులు ప్రకారం నిన్న ఆసుపత్రిలో 135 మంది రోగులున్నారు. వారిలో ఎందరు చనిపోయారు...ఎందరు అస్వస్థతకు గురై, చావుబతుకులమధ్యన కొట్లాడుతున్నారు... మరణించిన వారి పేర్లేమిటనే వివరాలను ప్రభుత్వం తక్షణమే బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తున్నా. రుయా ఘటనకు నైతికబాధ్యత వహిస్తూ, ఇంతటి అసమర్థ పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి రాజీనామా చేస్తాడా? లేక ఆయనకు సరైన సలహాలు ఇవ్వని సజ్జల రాజీనామా చేస్తాడా? ఆరోగ్యశాఖా మంత్రి రాజీనామా చేస్తాడో చెప్పాలి. ఆసుపత్రి సిబ్బంది వల్లే ఘటన జరిగిందని చెప్పి, చివరకు ఈప్రభుత్వం వారిని బలిచేస్తుందేమో చూడాలి. చనిపోయినవారి కుటుంబాలకు రూ.5లక్షలు, రూ.10లక్షలిచ్చి చేతులు దులుపుకోవడం ఈప్రభుత్వానికి అలవాటుగా మారింది. మరణాలు సంభవించకుండా చూడాల్సిన ప్రభుత్వం, వాటికి రేట్లు కట్టడమేంటి?