సార్వత్రిక ఎన్నికల ఫలితాల సరళిని గుంటూరు జిల్లా తాడేపల్లిలోని తన నివాసం నుంచే వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సమీక్షించనున్నారు. నిజానికి మంగళవారం ఇక్కడ ఆయన పార్టీ అభ్యర్థులతో భేటీ అవుతారని.. కౌంటింగ్ సందర్భంగా తీసుకోవలసిన జాగ్రత్తలను సూచిస్తారని వైసీపీ వర్గాలు తొలుత వెల్లడించాయి. ఆదివారం ఎగ్జిట్‌పోల్ ఫలితాలు వెలువడ్డాక తన షెడ్యూల్ మార్చుకున్నారని.. అభ్యర్థులతో భేటీని రద్దుచేసుకున్నారని తాజాగా పేర్కొన్నాయి. బుధవారం సాయంత్రం ఆయన తాడేపల్లి నివాసానికి చేరుకుని.. అతి ముఖ్య నేతలతో సమావేశమవుతారు. తాజా రాజకీయ పరిస్థితులు, జాతీయ మీడియా వెల్లడించిన ఎగ్జిట్‌పోల్స్, స్థానికంగా వచ్చిన ఎగ్జిట్‌పోల్ ఫలితాలపై విశ్లేషిస్తారు.
కేంద్రంలో ఎన్‌డీఏనే మళ్లీ వస్తుందని దాదాపు అన్ని సర్వేలూ స్పష్టం చేసినా.. ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి ఏకరూపంగా లేవు. కొన్ని చానళ్లు/సంస్థలు వైసీపీకి అనుకూలంగా ఇవ్వగా.. మరికొన్ని మళ్లీ చంద్రబాబే సీఎం అవుతారని పేర్కొన్నాయి. ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీయే అధికారంలోకి వస్తుందని తన సర్వేలో తెలిపారు. జగన్, వైసీపీ ముఖ్య నేతలు ఇప్పుడు ఈ సర్వేపైనే చర్చించుకుంటున్నారు. లగడపాటికి ఆయాచిత లబ్ధి జరిగిందని.. అందుకే టీడీపీకి అనుకూల సర్వే ఇచ్చారని వైసీపీ నేతలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. తెలంగాణలో ఆయన చెప్పిన ఫలితాలు తప్పయ్యాయని బయటకు అంటున్నా.. అంతర్గతంగా మాత్రం ఆ సర్వేపై ఆ పార్టీలో చర్చ జరుగుతోంది.
అధికార పక్షానికీ.. వైసీపీకి మధ్య 8-5 నుంచి 10 శాతం వరకూ తేడా ఉంటుందన్న జాతీయ సర్వే సంస్థల అభిప్రాయాన్ని వైసీపీ విశ్వసించడం లేదు. ఎన్నికల్లో పది శాతం తేడా అంటే.. ఫలితాలు ఏకపక్షంగా ఉంటాయని.. పోలింగ్ జరిగిన వెంటనే ఎవరు గెలుస్తారో చెప్పేయవచ్చని ఆ పార్టీ నేతలు అంటున్నారు. కానీ బూత్ స్థాయిలో అలాంటి పరిస్థితి లేదని.. పోటీ నువ్వానేనా అనేట్లుగా ఉందని చెబుతున్నారు. ఎవరు నెగ్గుతారేది ఫలితాల రోజు వరకు ఎదురుచూడక తప్పని పరిస్థితి నెలకొందని ఆంతరంగికంగా స్పష్టం చేస్తున్నారు. ఎగ్జిట్‌పోల్ ఫలితాలు తమలో కొంత ధీమా నింపినా.. మరోవైపు ఆందోళనా కలిగిస్తున్నాయని అంగీకరిస్తున్నారు.