ప్రతిపక్ష నేత జగన్ పాదయాత్రను కాపు నాయకులు అడ్డుకున్నారు. జగన్ పాదయాత్ర 223వ రోజు తూర్పుగోదావరి జిల్లా, జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలంలో కొనసాగుతోంది. కిర్లంపూడి మండలం గోనేడలో కాపు నాయకులు పాదయాత్రను అడ్డుకున్నారు. కాపులను మోసం చేయవద్దంటూ నినాదాలు చేశారు. కాపు యువత నాయకులు జగన్‌కు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. పాదయాత్రకు ఆటంకం కలిగిస్తున్నకాపు నేతలను జగన్ సెక్యూరిటీ సిబ్బంది పక్కకు నెట్టేసింది. వైసిపీ నాయుకులు కూడా వారిని గెంటేసారు, ప్లకార్డులు తీసి చించేశారు. దొరికిన వారిని దొరికినట్టు పిడి గుద్దులు గుద్దారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది.
శనివారం జగ్గంపేటలో పాదయాత్ర సందర్భంగా నిర్వహించిన బహిరంగసభలో జగన్ మాట్లాడుతే కాపు రిజర్వేషన్లపై తన వైఖరిని స్పష్టం చేశారు. కాపు రిజర్వేషన్ అంశం రాష్ట్ర పరిధిలోని అంశం కాదని, అందుకే తాను మాట ఇవ్వలేనన్నారు. తాను మాటిచ్చి తప్పలేనని, చేయగలిగే వాటికే తాను హామీ ఇస్తానన్నారు. రిజర్వేషన్లు 50 శాతం దాటవద్దని సుప్రీం కోర్టు చెప్పిందని జగన్ గుర్తు చేశారు.
అయితే జగన్ చేసిన వ్యాఖ్యలపై కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాపు రిజర్వేషన్ల అంశంలో జగన్ యూటర్న్ తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపులను ఆయన అవమానించారని, కాపులకేనా.. మొత్తం రిజర్వేషన్లకు జగన్ వ్యతిరేకమా అంటూ ప్రశ్నించారు.
రెట్టింపు నిధులిస్తానంటూ తమపై సవతితల్లి ప్రేమ చూపొద్దని, కాపులకు సీఎం చంద్రబాబు రిజర్వేషన్లు కల్పిస్తారని, జగన్ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ముద్రగడ ఆరోపించారు. కాపులను ఓట్లు అడిగే అర్హత జగన్ కోల్పోయారని చెప్పారు. జగన్ వ్యాఖ్యలు, ముద్రగడ జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలతో, కాపుల రిజర్వేషన్ రాద్దాంతం మరింత వేడెక్కింది. దీంతో ఆదివారం మధ్యాహ్నం గోనాడ పాదయాత్ర శిబిరం నుంచి జగన్ బయలుదేరిన పది నిమిషాల్లోనే గోనాడలో కాపు వర్గీయులు తమను మోసగించొద్దంటూ ఫ్లకార్డులు చూపుతూ నిరసన వ్యక్తం చేశారు. వారిని సెక్యూరిటీ సిబ్బంది కొడుతున్నా, జగన్ పట్టించుకోకుండా, వారందరికీ అభివాదం చేసుకుంటూ పాదయాత్ర ముందుకు కొనసాగించారు.