ఏపి ప్రభుత్వం, ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డి వైఖరితో, కేంద్రంలోని మంత్రులు అనేక సందర్భాల్లో, ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే. విద్యుత పీపీఏల విషయంలో, పోలవరం రివర్స్ టెండరింగ్ విషయంలో, ఉపాధి హామీ నిధులు విడుదల చెయ్యకుండా చేసిన విషయంలో, ఇలా అనేక సందర్భాల్లో, కేంద్ర మంత్రులు, జగన్ వైఖరిని తప్పు పట్టారు. ఇప్పుడు తాజగా మరో వివాదం చెలరేగటంతో, మరో కేంద్ర మంత్రి ఏపి ప్రభుత్వ తీరు పై మండిపడ్డారు. నెల్లూరు జిల్లాలో ఉన్న, వెంకటాచలంలో ఉన్న, స్వర్ణభారత్ ట్రస్ట్‌లో ప్రాచీన తెలుగు అధ్యయన కేంద్రాన్ని, కేంద్రం ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ కేంద్రాన్ని అక్కడ ఏర్పాటు చేయడం పై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తన అసహనాన్ని తెలియ చేస్తూ, తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్టు వార్తలు వచ్చాయి. స్వర్ణభారత్ ట్రస్ట్ అనేది, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు సంబంధించినది అనే విషయం అందరికీ తెలిసిందే. పోయిన నెల, అంటే జనవరి 20, 21 తేదీల్లో ఇక్కడ ప్రాచీన తెలుగు అధ్యయన కేంద్రం ప్రారంభం అయ్యింది.
సహజంగా, ఉపరాష్ట్రపతి వచ్చి, ఇలాంటి పెద్ద కార్యక్రమం చేస్తే, ముఖ్యమంత్రి హాజరవుతారు. కాని, ఇక్కడ జగన్ మోహన్ రెడ్డి రాలేదు. అయితే అసలు విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. తెలుగు విశిష్ఠ అధ్యయన కేంద్రం ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా, కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్, జగన్ మోహన్ రెడ్డికి పోయిన నెల ఒకటవ తారీఖున లేఖ రాసారు. అయితే, తనకు ఆ సమయంలో అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయని, తాను ఈ కార్యక్రమానికి రాలేను అంటూ జగన్ సమాధానం ఇచ్చారు. ఇలా చెప్తూనే, తెలుగు విశిష్ఠ అధ్యయన కేంద్రం, అక్కడ పెట్టటం పై తన అభ్యంతరం తెలియ చేస్తూ, జనవరి 17న, మంత్రికి తిరిగి జవాబు ఇచ్చారు. అక్కడ ఎలా ఏర్పాటు చేస్తారు, నేను అడిగితే, ప్రభుత్వ భూమి ఇచ్చే వాడిని కదా ని చెప్పినట్టు సమాచారం.
అయితే జగన్ లేఖ పై, కేంద్రం మంత్రి అదే స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేసారు. నేను మీకు జనవరి 1న లేఖ రాస్తే, మీరు జనవరి 17న స్పందిస్తూ, అభ్యంతరం చెప్పటం, సరైంది కాదు అని అన్నారు. మీరు వెంటనే స్పందించి ఉంటే, తగిన నిర్ణయం తీసుకునే వాళ్ళం అని అన్నారు. అక్కడ ఉచితంగా అద్దె లేకుండా వసతి లభించటం వల్లే, స్వర్ణభారత్ ట్రస్ట్‌లో ప్రారంభిస్తున్నామని, దీంట్లో మరో ఆలోచన లేదని అన్నారు. మీకు అంత ప్రేమ ఉంటే, మీరు మందే ఎందుకు భూమి ఇవ్వలేదు, ముందే భూమి ఇచ్చి ఉంటే, అక్కడే మొదలు పెట్టే వాళ్ళం కదా అని ఘాటుగా ప్రశ్నించారు. రెండేళ్ళ పాటు, ఉపరాష్ట్రపతి తన ట్రస్ట్ భవనంలో, అద్దె లేకుండా నిర్వహణ చేసుకోమన్నారని, దానికి దురుద్దేశాలు ఆపాదించడం సరైంది కాదని మానవ వనరుల శాఖ అధికారులు అంటున్నారు. ఉపరాష్ట్రపతి పైనే ఇలా చెయ్యటం వెనుక, రాజకీయ కారణాలు ఉన్నాయని, అంటున్నారు.