గత ఏడాది కాలంగా తెలుగుదేశం నేతలు టార్గెట్ గా, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, చేస్తున్న అనేక కార్యక్రమాల పై, టిడిపి నేతలు ప్రతి రోజు తమ ఆవేదన చెప్తూనే ఉన్నారు. ఎన్నికలు జరిగిన వెంటనే ఒక రెండు మూడు నెలలు, దాడులు జరిగాయి అంటే, ఏదో వేడిలో జరుగుతాయిలే అనుకోవచ్చు, కాని ఈ కక్ష సాధింపు మాత్రం, ఇప్పటికీ జరుగుతూనే ఉంది. తెలుగుదేశం నేతలు అచ్చెంనాయుడుని ఇప్పటికే ఈఎస్ఐ స్కాం అంటూ, ముప్పు తిప్పలు పెడుతున్నారు. ఇక జేసీ బ్రదర్స్ వ్యాపారాల అక్రమం అంటూ, వారిని కూడా ఇబ్బంది పెట్టి, చివరకు అరెస్ట్ చేసారు. ఇక నేతలు, కార్యకర్తలు పై కేసులు అయితే చెప్పే పనే లేదు. ఇంకా నేతలు ఉన్నారని, చంద్రబాబు, లోకేష్ ను కూడా లోపల వేస్తాం అని చెప్తున్నారు కూడా. అయితే, ఇవన్నీ పక్కన పడితే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎంపీ, లోక్ సభలో, ఆంధ్రప్రదేశ్ వాణి వినిపించే, గల్లా జయదేవ్ కు, షాక్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. గల్లా జయదేవ్ కుటుంబానికి, ముందు నుంచి కంపెనీలు ఉన్నాయి. అమర్ రాజా కంపెనీ గత కొన్నేళ్లుగా, గల్లా కుటుంబం నడుపుతున్న సంగతి అందిరికీ తెలిసిందే. దాదాపుగా 5 వేల మందికి ఉపాధి ఇస్తూ, రాష్ట్రానికి, దేశానికి అనేక పన్నులు కడుతుంది.
చిత్తూరు జిల్లాలో ఉన్న కరకంబాడీలో, ఈ ప్లాంట్ ఉంది. గతంలో 2009లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా, ఈ కంపెనీ విస్తరణ కోసం అని చెప్పి, 483.27 ఎకరాలు ఇస్తూ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. కాల క్రమేనా విస్తరణ చేసారు. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, ఈ 483 ఎకారాలలో, 253 ఎకరాలు వెనక్కు తీసుకోవాలని, ఈ రోజు జగన్ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. చెప్పినట్టు విస్తరణ చెయ్యలేదని, అందుకే వెనక్కు తీసుకుంటున్నాం అని తమ ఉత్తర్వుల్లో చెప్పింది. గత రెండు మూడు నెలలుగా, ఈ విషయం పై చర్చ జరుగుతూ ఉండగా, ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఇలా చాలా కంపెనీలు తమకు ఇచ్చిన పూర్తి భూమి వినియోగించుకోకుండా ఉన్నాయి. ఉదాహరణకు వాన్-పిక్ భూములు, బ్రాహ్మిణీ స్టీల్స్ విషయంలో కూడా, ఇలాగే అనేక ఎకరాలు ఖాళీగా ఉన్నాయి. మరి ఆ విషయంలో, ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి. తెలుగుదేశం నేతలు మాత్రం, లొంగని టిడిపి నేతలను ఇలా ఆర్ధికంగా ఇబ్బందులు పెడుతున్నారని, ఇలాంటి చేస్తే, మిగతా పారిశ్రామికవేత్తలకి, ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారు అంటూ, ప్రశ్నిస్తున్నారు.