నియోజకవర్గ సమన్వయకర్తలపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీలో అనిశ్చితి నెలకొంది. ఎప్పుడు ఎవరిని మార్చేస్తారోననే అభద్రతాభావంతో సమన్వయకర్తలు సతమతమవుతున్నారు. వీరిలో చాలామంది పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్నవారు ఉన్నారు. గత ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ, 2019 ఎన్నికల్లో అయినా తమను ఆదరిస్తారనే ఆశాభావంతో గత నాలుగున్నరేళ్లుగా ప్రజల్లో ఉన్నారు. ఆస్తులు అమ్ముకొనో... అప్పులు చేసో... పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అయితే పార్టీ అధిష్ఠానం మాత్రం ఇవేమీ పట్టించుకోకపోవడం వారిని క్షోభకు గురిచేస్తోంది. ‘ప్రజల్లో వున్న ఆదరణ కంటే ఎన్నికల్లో ఎంత ఖర్చు పెట్టగలరనే అంశానికే పార్టీ ప్రాధాన్యం ఇస్తోంది. గత నాలుగున్నరేళ్లుగా సమన్వయకర్తలుగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని నియోజకవర్గంలో పార్టీ కోసం కష్టపడినవారిని పక్కనపడేస్తోంది.

 style=

ఎన్నికల్లో రూ.20 కోట్లు ఖర్చుపెడతామని ఎవరైనా ముందుకువస్తే వారికే ప్రాధాన్యం ఇస్తోంది’ అని ఒక నేత వాపోయారు. ‘డబ్బు ఖర్చుపెడతామని హామీ ఇవ్వడంతోపాటు అందుకు తగిన ఆధారాలు చూపించిన వారికి సమన్వయకర్తగా బాధ్యతలు అప్పగించి...ఇంతకాలం పార్టీ కోసం అహోరాత్రులు కష్టపడినవారిని నిర్దాక్షిణ్యంగా పదవి నుంచి తప్పించేస్తున్నారు’ అని గత ఎన్నికలకు ముందు నుంచి పార్టీలో కీలకంగా పనిచేస్తున్న ఒక నేత వాపోయారంటే పరిస్థితి ఎలా ఉందనేది అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు పాయకరావుపేట నియోజకవర్గ సమన్వయకర్తగా కొత్తవారిని నియమించే యోచనలో ఉన్నట్టు పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ప్రస్తుతం సమన్వయకర్తగా పనిచేస్తున్న మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావును వచ్చే ఎన్నికల్లో రూ.15 కోట్లు ఖర్చుపెట్టగలవా? అని పార్టీలో కీలక నేత ఒకరు నేరుగా ప్రశ్నించినట్టు సమాచారం. అంత మొత్తం ఖర్చుపెట్టలేనని బాబూరావు సమాధానం ఇవ్వడంతో...పక్కకు తప్పుకుంటే పార్టీ అధికారంలోకి రాగానే పెద్ద పదవి ఇస్తామని చెప్పినట్టు సమాచారం. దీంతో ఒక్కసారిగా కంగుతిన్న బాబూరావు తన అనుచరుల వద్ద గోడు వెళ్లబోసుకున్నట్టు తెలిసింది. పార్టీ తీరుపై అసంతృప్తికి గురైన ఆయన్ను పార్టీకి చెందిన ఒక ఎంపీ ఫోన్‌ చేసి తొందరపడవద్దని సూచించినట్టు సమాచారం.

jagan 19092018 3

మొన్న ఎలమంచిలి... నిన్న విశాఖ ఉత్తర నియోజకవర్గం... నేడు దక్షిణ నియోజకవర్గం... రేపు ఏ నియోజకవర్గం వంతో?... వరుసగా సమన్వయకర్తల మార్పు నేపథ్యంలో ప్రస్తుతం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తల మదిని తీవ్రంగా తొలుస్తున్న ప్రశ్న ఇది. 2019 ఎన్నికలకు మరో ఎనిమిది నెలలే గడువు ఉన్నప్పటికీ వైసీపీ నుంచి ఎవరు పోటీ చేస్తారనే విషయంలో పార్టీ నేతలకే స్పష్టత లేకుండా పోయింది. నెలకు ఒక నియోజకవర్గం సమన్వయకర్తను మార్చేస్తుండడంతో ఎన్నికల నోటిఫికేషన్‌ నాటికి ఎవరు ఉంటారో... ఎవరు ఊడిపోతారో తెలియని పరిస్థితి నెలకొంది. ఎన్నికల నాటికి ఎన్‌ఆర్‌ఐ ఎవరో వచ్చి తనకు ఫలానా నియోజకవర్గం టిక్కెట్‌ ఇస్తే రూ.25 కోట్లు ఖర్చు పెడతానంటే అప్పటివరకూ పార్టీ కోసం పనిచేసిన వారిని తప్పించేసి అతడ్ని అభ్యర్థిగా ఖరారు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని కొంతకాలం కిందటి వరకూ సమన్వయకర్తగా పనిచేసిన ఒక నేత పేర్కొనడం చూస్తే అధిష్ఠానం వ్యవహరశైలి ఎలా ఉందనేది అర్థమవుతుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read