ప్రముఖ మతబోధకుడు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంబరం ఆవిరైంది. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె.ఎ.పాల్‌కు కేంద్ర ఎన్నికల సంఘం షాకిచ్చింది. ఆయన పార్టీ గుర్తు హెలికాప్టర్‌ను పక్కనపెట్టింది. ఆయన హెలికాప్టర్ గుర్తు తమ పార్టీ గుర్తు ఫ్యాన్‌ను పోలి ఉండడంతో ఎన్నికల్లో తమకు నష్టం జరిగే అవకాశం ఉందని, అందువల్ల దాన్ని తొలగించాలని వైసీపీ అధినేత జగన్ సూచన మేరకు, మాజీ ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఫిర్యాదుపై స్పందించిన ఈసీ పాల్‌కు నోటీసులు జారీ చేసింది. దీనిపై స్పందించిన పాల్ ప్రపంచంలో ఎక్కడైనా హెలికాప్టర్, ఫ్యాన్ ఒకేలా ఉండడం చూశామా? ఇందులో వైసీపీ దురుద్దేశం ఉందని ఆరోపించారు.
రెండు గుర్తుల మధ్య తేడాను ప్రజలు స్పష్టంగా గుర్తించగలరని ఈసీకి సమాధానమిచ్చారు. పాల్ స్పందనను పెద్దగా పట్టించుకోని ఈసీ ఆయన గుర్తును పక్కన పెడుతూ నిర్ణయం తీసుకుంది. అయితే, హెలికాప్టర్ గుర్తును పక్కనపెట్టి మరో గుర్తును కేటాయించేందుకే ఈసీ మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. ప్రజాశాంతి పార్టీ గుర్తు హెలికాప్టర్ తమ ఫ్యాన్ గుర్తును పోలి ఉండడంతో ఓటర్లు పొరబడే అవకాశం ఉందని, కాబట్టి దానిని తొలగించి, ఆ స్థానంలో వేరే గుర్తును కేటాయించాలంటూ వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. ఇప్పుడు గుర్తు రద్దు చెయ్యటంతో పాల్ లబోదిబో అంటున్నారు. జగన మోహన్ రెడ్డి ఏమి చేసినా ఈసీ సై అంటుందని, తెలుగుదేశం పై కూడా ఇలాగే కంప్లైంట్ ఇచ్చిన విషయాన్ని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.
ఇదే విషయం పై నిన్న పాల్ మీడియాతో మాట్లాడారు. తమ పార్టీకి హెలికాప్టర్ గుర్తును కొనసాగించమని కేంద్ర ఎన్నికల సంఘాన్నికోరినట్లు కె.ఏ.పాల్ తెలిపారు. దిల్లీలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వైకాపా నేత వై.వి.సుబ్బారెడ్డి ఫిబ్రవరి 21న ఎన్నికల కమిషనర్‌ను కలిసి హెలికాప్టర్ గుర్తు తమ పార్టీ ఫ్యాన్ గుర్తును పోలి ఉందని.. ఎన్నికల్లో తమకు ఇబ్బంది ఉన్నందున ఆ గుర్తును నిలిపివేయాలని ఫిర్యాదు చేశారని తెలిపారు. ప్రస్తుతం ఎన్నికల సంఘం తమ గుర్తును హోల్డ్‌లో ఉంచిందని.. దీనిపై తమకు నోటీసు ఇవ్వడంతో తాము ఎన్నికల సంఘం అధికారులను కలిసి తమ గుర్తును కొనసాగించమని కోరినట్లు తెలిపారు. అయితే పాల్ ఆశలు ఆవిరి అయ్యాయి.