నిన్న, ఈ రోజు, ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం అయిన సంగతి తెలిసిందే. నిన్న అయితే అసెంబ్లీకి పక్కన పెట్టి మరీ, క్యాబినెట్ సమావేశం జరిపి, అసెంబ్లీ కూడా కొంత సేపు వాయిదా వేసారు. అయితే నిన్న జరిగిన సంఘటన, ఈ రోజు మళ్ళీ క్యాబినెట్ సమావేశం అయ్యి తీసుకున్న ఒక నిర్ణయం మాత్రం, ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నిజానికి నిన్న క్యాబినెట్ అజెండా గా, ఎనిమిది అంశాలు అనుకుని అజెండా రూపొందించారు. అయితే ఈ అజెండాలో టేబుల్ అంశాలుగా కొన్ని చేరి, ఎనిమిది ఉన్న అజెండా కాస్తా 22కు చేరింది. ముఖ్యంగా నవరత్నాలు పై ఎక్కువగా అజెండాలో చర్చించారు. ఇక్కడి దాకా ఇబ్బంది లేదు, ఎవరి ప్రాధాన్యతలు వాళ్లకి ఉంటాయి కాబట్టి, సాధ్యాసాధ్యాలు చూసుకుని, అధికారులు కూడా వాటి పై తమ సలహాలు, నిర్ణయాలు ప్రకటిస్తూ ఉంటారు.
నవరత్నాల అమలు పై చర్చ సందర్భంలో, కొంత మంది మంత్రులు, అధికారులు, ప్రస్తుతం ఉన్న ఆర్ధిక పరిస్థితి గురించి వివరిస్తూ, వీటి పై నెమ్మిదిగా నిర్ణయం తీసుకుందాం అని చెప్పటంతో, జగన మోహన్ రెడ్డి వారి పై విరుచుకుపడ్డారు. నేను అన్నీ ఆలోచించే చెప్తున్నా, నేను ఒక ముఖ్యమంత్రిని, నేను చెప్పినా వినరా, వీటి పై ముందుకు వెళ్ళాల్సిందే అని తీవ్ర ఆవేశంతో జగన్ చెప్పటంతో, మొదటిసారి అక్కడ ఉన్న వాళ్ళు అవాక్కయ్యారు. ఇక తరువాత అజెండాగా పరిశ్రమల శాఖలో, స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలి అనే అంశం పై, చర్చకు వచ్చింది. ఈ చర్చ సందర్భంలో జగన్ మోహన్ రెడ్డి ఉగ్ర రూపం చూసి, క్యాబినెట్ సమావేశం హాల్ మొత్తం, పిన్ డ్రాప్ సైలెన్స్ గా మారిపోయింది. తన పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని, బిల్ తాయారు చెయ్యాలని అధికారులను కోరారు జగన్.
అయితే పరిశ్రమల శాఖ కార్యదర్శి, మహిళా ఐఏఎస్ అయిన ఉదయ లక్ష్మి, ఆమె సలహాగా చెప్తూ, ఇది సాధ్య పడదు అని, దీని వల్ల ప్రభుత్వానికి లేని పోనీ తలనొప్పులు వస్తాయని అన్నారు. స్కిల్ ఉన్న ఉద్యోగాలు కావాలి అంటే బయట నుంచి వివిధ కంపెనీలు తెచ్చుకుంటాయని, మనం ఇలాంటివి పెడితే, పెట్టుబడులు రావని, ప్రభుత్వానికే ఇబ్బంది అని అన్నారు. ఈ మాటలు విన్న జగన్, మహిళా అధికారి అని కూడా చూడకుండా, అందరి ముందు ఆమె పై, తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. నేను బయటకు వెళ్లి, మా ఉదయ లక్ష్మి చెప్పింది, మీకు ఉద్యోగాలు ఇవ్వటం కుదరదు అని చెప్పినా అంటూ ఆగ్రహం వ్యక్తం చెయ్యటంతో, ఒకరి మొఖాలు ఒకరు చూసుకున్నారు. ఈ లోపు ఎల్వీ సుభ్రమణ్యం కలగ చేసుకుని, వేరే మార్గాలు ఉన్నాయని చెప్పటంతో, రేపటి లోగా ఆ బిల్ నా ముందు ఉండాలి అని చెప్పి, అక్కడ నుంచి విసురుగా వెళ్ళిపోయారు. దీంతో చేసేది ఏమి లేక, ఈ రోజు క్యాబినెట్ మీటింగ్ లో ఆ బిల్ తయారు చేసి తీసుకువచ్చారు. జగన్ మోహన్ రెడ్డి అవగాహన రాహిత్యంతో, అధికారులు కక్కలేక మింగలేక, తప్పు అని చెప్పలేక ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. అయిన రాజు తలుచుకుంటే, ఈ సైనికులు అడ్డం పడితే ఎలా ?