ప్రత్యేక హోదాపై ప్రధాని మోదీని అభ్యర్థించడం మినహా మరేమీ చేయలేమని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ‘‘ప్లీజ్ గాడ్... ఎన్డీయే బలం 250తో ఆగాలని ఆ దేవుడిని బలంగా కోరుకున్నాను. దురదృష్టవశాత్తూ 350 పైచిలుకు స్థానాలు వచ్చాయి. మన అవసరం వాళ్లకు లేదు. రాష్ట్రంలో దేవుడు మాకు ఘన విజయం ఇచ్చినట్లే, దేశవ్యాప్తంగా వాళ్లకు ఇచ్చాడు. ఇలాంటి పరిస్థితుల్లో... సార్ ప్లీజ్, సార్ ప్లీజ్ అని అడగడం తప్ప... డిమాండింగ్, కమాండింగ్ చేయలేం’’ అని జగన్ పేర్కొన్నారు. ఆదివారం ఢిల్లీకి వచ్చిన ఆయన తొలుత ప్రధాన మంత్రి మోదీతో, ఆ తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో వేర్వేరుగా భేటీ అయ్యారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అనంతరం... తొలిసారిగా ఏపీ భవన్లో మీడియాతో అనేక అంశాలపై వివరంగా మాట్లాడారు.
‘‘ఎన్డీయే 250 స్థానాలకే పరిమితమైతే... వైసీపీకి అద్భుతంగా ఉండేది. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చిన తర్వాతే ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పే పరిస్థితి ఉండేది. కానీ, దురదృష్టవశాత్తు అలా జరగలేదు. మనం ఒకరిపై ఆధారపడాల్సిన పరిస్థితి. మన అవసరం వాళ్లకు లేదు. వాళ్లే బలంగా ఉన్నారు. ఇప్పుడు ప్రధానమంత్రిని మొట్టమొదటిసారి కలిశాను. దేవుడి దయ ఉంటే ఇంకా 30సార్లో, నలబైసార్లో కలుస్తాను. కలిసిన ప్రతిసారీ... ప్రత్యేకహోదా గురించి అడుగుతూనే ఉంటాను. ఇది పార్లమెంటు వేదికగా ఇచ్చిన హామీ అని గుర్తు చేస్తాను. దీనిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఒత్తిడి చేస్తూనే ఉంటాం’’ అని తెలిపారు. ఇలా అడుగుతూ పోతే ఏదో ఒక సందర్భంలోనైనా ప్రధాని మనసు మారుతుందనే నమ్మకం ఉందని జగన్ చెప్పారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రాన్ని బాగా నడపాలంటే కేంద్ర సహాయం అవసరమని జగన్ అన్నారు. ‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల గురించి గత మూడు నాలుగు రోజుల్లో తెలుసుకున్నాను. కేంద్రం నుంచి నుంచి సహాయం అవసరమని గ్రహించాను. ప్రధాని మోదీని సహాయం కోసం అభ్యర్థించాను. మొత్తం వివరాలను మోదీ దృష్టికి తీసుకెళ్లి... అన్నిరకాల సహాయ సహకారాలు అవసరమని చెప్పాను. రాష్ట్రాన్ని బాగా నడపాలనే తపన, తాపత్రయం ఉంది. డబ్బులు బాగుంటే... రాష్ట్రాన్ని బాగా నడపొచ్చు. అందుకే, ప్రధానిని సహాయం కోరాను’ అని జగన్ వివరించారు. ప్రత్యేక హోదా ఒక్కటేకాదని, రాష్ట్రానికి విపరీతమైన సమస్యలున్నాయని జగన్ చెప్పారు. మోదీ తనకు గంటపాటు సమయం ఇచ్చారని, చెప్పిందంతా విన్నారని, రాష్ట్రానికి సహాయం చేయాలనే తపన ఆయనలో కనిపించిందని, ఇది శుభ సంకేతమని తెలిపారు.