భయమో తెలియదు. ముందు జాగ్రత్తో తెలియదు. తన కోటరీలోనూ, సీఎంవోలోనూ పనిచేసి రిటైరైన ప్రతీ అధికారి తన చుట్టూనే వుండేలా చూసుకుంటున్నారు జగన్ మోహన్ రెడ్డి. నిబంధనలకు విరుద్ధంగా తన సర్కారు తీసుకున్న నిర్ణయాలకు గంగిరెద్దులా తలూపిన అందరికీ అందలం ఎక్కించిన సీఎం, వారు పదవీ విరమణ చేసినా ఏదో ఒక కీలక పదవి కట్టబెట్టి తన వద్దే ఉంచుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దగ్గర కీలక పదవులు నిర్వహించిన బ్యూరోక్రాట్లు అంతా రిటైర్ అయ్యాక మరో కీ పొజిషన్లో కూర్చుంటున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పదవీ విరమణ తరువాత అవకాశం వున్నంతవరకూ ఎక్స్ టెన్షన్ ఇవ్వడం, సాధ్యం కాకపోతే వారి కోసం కొత్త పోస్టు సృష్టించడం, లేదంటే ఏదో ఒక విభాగానికి సలహాదారులుగా నియమిస్తున్నారు. ఏపీ చీఫ్ సెక్రటరీలుగా పనిచేసి పదవీ విరమణ చేసిన ఒక్కొక్కరికీ ఒక్కో అందలం అందుతోంది. టిడిపి ప్రభుత్వంలో సీఎస్ గా పనిచేసిన అజయ్ కల్లం జగన్ ప్రభుత్వం రాగానే సలహాదారుడు పోస్టు దక్కించుకున్నారు. నీలం సహాని చీఫ్ సెక్రటరీ నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ విధుల్లో చేరిపోయారు.
చీఫ్ సెక్రటరీ పదవీ కాలం ముగియగానే ఆదిత్యనాథ్ దాస్ న్యూఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటికే రెండుసార్లు ఎక్స్ టెన్షన్ లభించిన సమీర్ శర్మ సీఎస్ గా పదవీ విరమణ చేశారు. కాలుష్యనియంత్రణ మండలి చైర్మన్ గానూ, ప్రభుత్వ ఎక్స్ అఫీషియో చీఫ్ సెక్రటరీగా సమీర్ శర్మను నియమించాలని ఉత్తర్వులు జారీ చేశారు. ప్రణాళికా విభాగం ఎక్స్ అఫీషియో కార్యదర్శిగా రిటైరైన జీఎస్ఆర్ కేఆర్ విజయకుమార్ ని స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ సీఈఓగా నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. డిజిపిగా పనిచేసిన గౌతమ్ సవాంగ్ ని ఏపీపీఎస్సీ చైర్మన్ పదవిలో కూర్చోబెట్టారు. రిటైరైన ఉన్నతాధికారులు తన సర్కారు గుట్టుమట్లు బయటపెట్టకుండా, తనకు విధేయులుగా పడి వుంటారనే ఇలా పదవులు కట్టబెడుతున్నారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.