చంద్రబాబు చేస్తున్న పోరాటం అంతా బూటకం అని, పార్లమెంట్ లో చేసింది అంతా నాటకమని వైసీపీ అధ్యక్షుడు జగన్ అన్నారు. అంతే కాదు చంద్రబాబుకు సలహా కూడా ఇచ్చారు. ఎలా చేస్తే మోడీ దిగివస్తాడో చెప్పారు. రాష్ట్ర ఎంపీలంతా రాజీనామా చేసి పోరాడితే ప్రత్యేక హోదా ఎందుకు రాదని జగన్ ప్రశ్నించారు. ఏపీ పై కేంద్ర వైఖరికి నిరసనగా, టీడీపీ ఎంపీల రాజీనామాపై ఒత్తిడి తెచ్చేందుకు వైసీపీ ఈనెల 24న రాష్ట్ర బంద్ నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. అన్ని పార్టీలు, సంఘాలు, వ్యాపారులు తమ బంద్‌కి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. శనివారం ఉదయం తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో జగన్ మీడియాతో మాట్లాడారు.
‘‘మీరు పెట్టిన అవిశ్వాసం వీగిపోయింది. ఇప్పుడైనా టీడీపీ ఎంపీలందరితో రాజీనామా చేయించి నిరాహారదీక్షలో కూర్చోబెట్టండి. రాజీనామా చేసిన మా ఎంపీలనూ పంపుతాను. దేశమంతా ఇటే చూస్తుంది. హోదా ఎందుకు రాదో చూద్దాం!’ అని జగన్ ఆవేశపూరితంగా అన్నారు. ‘‘శుక్రవారం పార్లమెంటులో జరిగిన సన్నివేశాలు మనమంతా చూశాం. నేను ప్రత్యక్షంగా చూడలేకపోయినా (ఆ సమయంలో కోర్టుకు హాజరయ్యా రు) జరిగిన విషయాలు తెలుసుకున్నా. నిజంగా బాధనిపించింది.ఆంధ్రరాష్ట్ర ప్రజల హక్కును తాకట్టుపెట్టే అధికారం కేంద్రం, చంద్రబాబుకు ఎవరిచ్చారు?’’ అని జగన్ ప్రశ్నించారు.
మొత్తానికి తన ఎంపీల లాగే రాజీనామా చేసి, బయట కూర్చోమని జగన్, చంద్రబాబుకు సలహా ఇస్తున్నారు. ఈ సలహా జగన్ ఇది వరకు కూడా ఇచ్చారు. అందరూ రాజీనామా చెయ్యండి అన్నారు. కాని, నిన్న అవిశ్వాసం సమయంలో ఏమైందో అందరం చూసాం. సభలో ఉండి, మోడీ చేసిన మోసం పై దేశానికి చెప్పారు తెలుగుదేశం ఎంపీలు. ఇంత చేసినా, మన సమస్యలు ఢిల్లీ పెద్దలకు పెద్దగా పట్ట లేదు. అలాంటిది రాజీనామా చేసి బయట కుర్చుకుంటే, ఎవరన్నా మన మొఖం చూస్తారా ? ఒక్క మీడియా అయినా మన మాట ఆలకిస్తుందా ? సాక్షిలో జగన్ డబ్బా తప్ప, ఇంకా దేనికి రాజీనామాలు ఉపయోగపడతాయి ? మోడీని తెలుగుదేశం ఎంపీలు నిలదీస్తున్నారు కాబట్టి, మోడీ ఏమన్నా అంటే తట్టుకోలేని జగన్, రాజీనామా చేసి బయటకు వచ్చేయమంటున్నారు. మరో రెండు రోజులల్లో ట్విట్టర్ వీరుడు కూడా, ఇదే వాదన అందుకుంటాడు.