వైసీపీ అధినేత జగన్ అమరావతికి ఎప్పుడు షిప్ట్ కాబోతున్నారు. మంగళగిరి మండలం తాడేపల్లి 2వ వార్డు అమరారెడ్డి కాలనీలో రెండెకరాలు భూమిని జగన్ కొనుగోలు చేసి ఇల్లు, ఆఫీస్ ఒకే చోట నిర్మించారు. నిజానికి ఫిబ్రవరి 14న గృహ ప్రవేశం జరగాల్సి ఉంది. అయితే రకరకాల కారణాల వల్ల వాయిదా పడింది. జగన్ ఇల్లు ఎలా ఉన్నా ఇప్పుడు ఇంటికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఇల్లు, ఆఫీస్ ఎంత విస్తీర్ణంలో నిర్మించారు. ఎలా నిర్మించారన్న చర్చ వినిపిస్తోంది. తాడేపల్లిలో జగన్ ఇల్లు మరో లోటస్‌పాండ్‌లా ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత రాజకీయలను చూస్తుంటే జగన్ అమరావతికి రావడానికి మరింత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది.
చేరికలు, చర్చలు హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్ నుంచే జరుగుతున్నాయి. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో వివిధ పార్టీల నేతల నివాసాలు, పార్టీ ఆఫీసుల నిర్మాణాలు చేపడుతున్నారు. ఇటీవల సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, జగన్‌ను కలిశారు. తాను ఫిబ్రవరి 14న ఏపీ రాజధాని అమరావతి పరిధిలోని తాడేపల్లిలో గృహప్రవేశం చేస్తున్నానని, ఈ కార్యక్రమానికి రావాలని జగన్ ఆహ్వానించారు. ఇందుకు కేసీఆర్ సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే అనుకోని కారణాల వల్ల గృహప్రవేశ కార్యక్రమం వాయిదా పడింది.
ఇప్పటీకే అన్ని పార్టీల ఆఫీసులు అమరావతి కేంద్రంగా నిర్మించుకున్నారు. జగన్ అమరావతిలో ఇల్లు నిర్మించలేదని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో ఆయన తన నివాసాన్ని అమరావతిలో నిర్మిస్తున్నారు. రెండు భవనాల్లో మొదటి భవనం వైసీపీ ప్రధాన కార్యాలయంగా ఉండబోతుందనే ప్రచారం జరుగుతోంది. ఇక్కడ కార్యకర్తలకు, నేతలకు అన్ని సౌకర్యాలు ఉండేలా భవనాలను నిర్మిస్తున్నారు. ఈ భవనాలు రాజధానికి కేవలం పది కిలోమీటర్లు దూరంగా ఉండడం.. జాతీయ రహదారికి దగ్గరగా ఉండడంతో ఆ ప్రాంతాన్ని జగన్ ఎంచుకున్నట్లు తెలుస్తోంది.