గత 5 ఏళ్ళుగా అవినీతిని అవినీతి అంటూ మనల్ని ఆరోపించారని, గత రెండేళ్ళుగా కేంద్రం కూడా మన మీద అవినీతి మరకలు వెయ్యటానికి స్పెషల్ టీంలు వేసి, అవినీతి అంటించాలని చూసి, ఒక్క రూపాయి కూడా అవినీతి నిరూపించలేకపోయారని, ఇప్పుడు మళ్ళీ వైసీపీ వచ్చి, తెలుగుదేశం పార్టీకి అవినీతి మరకలు అంటించాలని చూస్తుందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరోపించారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, ఎప్పుడైనా రాష్ట్ర ప్రయోజనాల కోసమే పని చేసామని స్పష్టం చేశారు. నిన్న చంద్రబాబు నివాసంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు సమావేశమయ్యారు. విదేశీ పర్యటనలో ఉన్న చంద్రబాబు, నేతలతో ఫోన్ లో మాట్లాడారు. తప్పుడు ఆరోపణలు చేస్తూ, అక్కడ లేని అవినీతిని మనకు అంటించాలని చూస్తే, అది వారికే చుట్టుకుంటుందని చంద్రబాబు అన్నారు. ప్రజలకు మరింత దగ్గరయ్యి, వారి సమస్యల పై పోరాడాలని పార్టీ నేతలను సూచించారు. వైసీపీ చేస్తున్న దాడులు, వారి చేతిలో గాయపడిన వారికి అండగా ఉండాలని చంద్రబాబు అన్నారు. పోలవరం, అమరావతి, ఇతర అభివృద్ధి పనులపై అవినీతి జరిగిపోయినట్లుగా జగన్, మంత్రులు అంటున్నారని, ఇప్పటి వరకు ఒక్కటి కూడా ప్రూవ్ చెయ్యలేకపోయారని అన్నారు.
ఈ సందర్భంగా టీడీఎల్పీ డిప్యూటీ లీడర్ అచ్చెన్నాయుడు మాట్లాడుతూ " అక్కడేదో పెద్ద కొండ ఉంది, తవ్వుతానంటున్నారు, తవ్వుకోండి, తవ్వితే ఎలుక కాదు కదా చీమ, దోమను కూడా మీరు పట్టుకోలేరు. ఎంత తవ్వుతారో, ఎక్కడ నుంచి తవ్వుతారో తవ్వండి, ఎంత లోతుకు తవ్వుతారో తవ్వుకోండి అని అన్నారు. నెల రోజుల నుంచి, తవ్వడానికి గునపాలే దొరకడం లేదన్నట్లుగా మాట్లాడుతున్నారు. అవినీతి ఆరోపణలు నిరూపించలేక, అధికారులను అడుగుతూ, అవినీతి బయటపెడితే సన్మానం చేస్తాం అనే స్థాయికి వచ్చారు. జగన్ గురించి, ఆయన కేబినెట్ మంత్రులు గతంలో ఏం మాట్లాడారో అన్ని రికార్డులు మా దగ్గర ఉన్నాయి. వీరందరూ చేసిన చరిత్రలు ఉన్నాయి, ఈ రోజు ఎదో నీతులు చెప్తున్నారు. గతంలో జగన్ అత్యంత అవినీతిని విమర్శించిన వాళ్ళు, ఇప్పుడు జగన్ పక్కన చేరి తాము అసలు అవినీతి అంటే ఏంటో ఎరగం అయినట్లు మాట్లాడుతున్నారు. బొత్స సత్యనారాయణ, కన్నబాబు లాంటి నాయకులు, గతంలో జగన్ అవినీతి గురించి, వైఎస్ ప్రతి రోజు తాగుతాడు అనే అలవాట్ల గురించి ఏమన్నారో అందరికీ గుర్తుందని’’ అన్నారు.