సోషల్ మీడియా పవర్ రోజు రోజుకీ పెరిగిపోతుంది. సోషల్ మీడియాలో వచ్చే వార్తలు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వచ్చే పరిస్థితి. సోషల్ మీడియా గెలుపు ఓటములను కూడా ప్రభావితం చేస్తుంది అనేది మొన్నటి ఎన్నికలో కూడా అర్ధమైంది. ఇప్పుడు ఇదే సోషల్ మీడియా, జగన్ పరిపాలనను ప్రశ్నిస్తుంది. ఏ సోషల్ మీడియాలో అయితే జగన్ ను ఎత్తారో, ఇప్పుడు అదే సోషల్ మీడియా ద్వారా జగన్ ను ప్రశ్నించే పరిస్థితి. గత వారం రోజుల్లో, జగన్ ప్రభుత్వం వదిలిన రెండు జీఓలు, సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎంతలా అంటే, చివరకు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా అవి మాట్లాడుకునే అంత. నేను కిన్లే వాటర్ బాటిల్ వాడుతూ డబ్బులు ఆదా చేస్తున్నాను అని చెప్తున్న జగన్, ఇప్పుడు దుబారా ఖర్చు చేస్తున్నారని సోషల్ మీడియాలో నెటిజెన్లు ప్రశ్నిస్తున్నారు. ప్రమాణ స్వీకారం తక్కువలో ఖర్చులో చేసాను అని చెప్పి, రెండో రోజే ఇచ్చిన ఇఫ్తార్ విందులో, 6 వేల మంది భోజనాలకి, 1.1 కోట్లు విడుదల చేసి, జాతీయ మీడియాకు ఎక్కారు.
అయితే ఇప్పుడు ముఖ్యంగా గత వారం రిలీజ్ అయిన రెండు జీఓల గురించి మాట్లాడుకుంటే, ఒక జీఓ ప్రకారం, జగన్ ఇంటి వద్ద హెలీప్యాడ్ ఏర్పాటుకు, టాయిలెట్ కట్టటానికి బ్యారికేడ్ లు వెయ్యటానికి, రూ.1.89 కోట్ల మంజూరు చేసింది. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది, కేవలం టాయిలెట్ లు కట్టటానికి 30 లక్షలు, ఇంటి చుట్టూ బ్యారికేడ్ లు కట్టటానికి 75 లక్షలు విడుదల చేస్తూ జీఓ రిలీజ్ అయ్యింది. ఇంత ఖర్చు ఎందుకు అవుతుంది అని, అదే ప్రజా వేదిక 90 లక్షలతో కడితే ఎందుకు గొడవ చేసరాని ప్రశ్నిస్తున్నారు. ఇక మరో జీఓలో, జగన్ ఇంటి సమీపంలో, 1.3 కి.మీ. పొడవైన రోడ్డు విస్తరణకు రూ.5 కోట్లు మంజూరు చేస్తూ విడుదల అయిన జీఓ పై కూడా నెటిజెన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 1.3 కి.మీ రోడ్డుకు, 5 కోట్లా అంటూ ప్రశ్నిస్తున్నారు. దేని పై ఇప్పటి వరకు వైసీపీ నేతలు మాత్రం, ఏ సమాధానం చెప్పలేదు.