ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేని వివాదం రేపిందా ? లేక ప్రజల మూడ్ ని తక్కువ అంచనా వేసిందో కానీ, ఇప్పటికీ ఉన్న సమస్యలకు తోడుగా, ఇప్పుడు వచ్చిన మరో సమస్య, జగన్ ప్రభుత్వానికి చేటు తెచ్చిపెట్టింది అనటంలో సందేహం లేదు. ఇప్పటికే జగన్ మోహన్ రెడ్డి క్రీస్టియన్ అని, హిందూ వ్యతిరేకి అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో, ఆ మచ్చ చేరుపుకోవటానికి జగన్ ఎన్నికల ముందు అనేక ప్రయత్నాలు చేసారు. చివరకు గంగలో కూడా మునిగారు. నిజానికి ఈ చర్యతో హిందూ ఓటు బ్యాంకులో కొంత పాజిటివ్ వచ్చింది. అయితే ప్రభుత్వంలోకి వచ్చిన తరువాత, జరిగిన అనేక సంఘటనలు, మళ్ళీ ఆయన పై ఉన్న ప్రచారానికి బలం చేకూర్చేలా ఉన్నాయి. పదో తారిఖు వినాయక చవితి పండుగ ఉన్న సంగతి తెలిసిందే. మాములుగా అయితే వాడ వాడలా పందిరులు, విగ్రహాలు పెట్టి, పూజలు చేసుకుంటారు. క-రో-నా కారణంగా కొంత ఆంక్షలు ఉంటాయని ప్రజలు భావించారు. అయితే రెండు రోజుల క్రితం, అసలు బయట పందుకే జరుపుకోకూడదని, కేవలం ఇళ్ళలోనే చేసుకోవాలి అంటూ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలతో ఒక్కసారిగా వ్యతిరేకత భగ్గు మంది. ఆంక్షలు పెట్టి, ఇంత మంది మాత్రమే ఉండాలి, నిబంధనలు పాటించాలి అని చెప్పాలి కానీ, ఇలా అసలు చేసుకోవద్దు అని చెప్పటం పై విమర్శలు వచ్చాయి.
దీనికి కారణాలు కూడా చెప్తున్నారు. స్కూల్స్ లు తెరవలేదా అని ప్రశ్నిస్తున్నారు. సినిమా హాల్స్ గురించి ప్రస్తావిస్తున్నారు. ఇక మద్యం షాపుల దగ్గర హడావిడి అయితే సరే సరే. అలాగే మొన్న రాజశేఖర్ రెడ్డి జయంతిని, వైసీపీ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు, ఇక ప్రభుత్వం చేసే కార్యక్రమాలు అయితే లెక్కే లేదు. అలాగే మొహరం పండుగకు ఇలాంటి నిబంధన పెట్టలేదని వాదిస్తున్నారు. క-రో-నా ఆంక్షలు, నిబంధనలు పెడితే సరిపోయే దానికి, అసలు బయట పండుగ చేసోకోకూడదు అని పోలీసుల చేత చెప్పించటం, అలాగే విగ్రహాలు చెత్త బండిలో తీసుకుని వెళ్ళటం, ఇవన్నీ లేని వివాదాన్ని సృష్టించటం లాగే ఉందని, ప్రభుత్వం ఈ విషయంలో ప్రజల మూడ్ ని తక్కువ అంచనా వేసిందా, లేక బీజేపీ పార్టీకి లబ్ది చేకూర్చటానికి ఈ ప్రయత్నం చేస్తుందా అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఇంత రచ్చ అయ్యింది కాబట్టి, కొన్ని ఆంక్షలు, నిబంధనలతో, ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుని, ప్రజలకు అర్ధం అయ్యేలా చెప్తుందో లేక ఇలాగే మొండిగా వెళ్తుందో చూడాలి.