జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఏ1 గా ఉన్న జగన్, ఏ2గా ఉన్న విజయసాయి రెడ్డి బెయిల్ రద్దు చేయాలి అంటూ, రఘురామకృష్ణం రాజు వేసిన పిటీషన్ల పై, ఈ రోజు అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. నిజానికి ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటీషన్ పై తీర్పు వస్తుందని అందరూ భావించారు. ఎందుకంటే, ఇప్పటికే వాదనలు అన్నీ ముగిసాయి. కోర్టు కూడా 20 రోజులకు పైగా టైం తీసుకుంది, దీంతో ఇక తీర్పు వచ్చేస్తుందని అందరూ అనుకున్నారు. దానికి తగ్గట్టే, బెయిల్ పిటీషన్ ఏమి అవుతుందో అని, రాష్ట్రం మొత్తంతో పాటు, వైసీపీ పార్టీ కూడా ఉత్సుకతతో ఎదురు చూసింది. అయితే ఉదయం 11 గంటల ప్రాంతంలో, జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలి అంటూ, రఘురామరాజు వేసిన పిటీషన్ ని కొట్టేసినట్టు, సాక్షి టీవీలో బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. దీంతో అందరూ, ఇదే తీర్పు ఏమో అని అనుకున్నారు. అయితే మిగతా టీవీ చానల్స్ ఏమి వేయకపోవటంతో, అసలు విషయం తెలుసుకున్నారు. అయితే సాక్షి వేసిన ట్వీట్ కొద్ది సేపటికి డిలీట్ అయిపొయింది. ఇక్కడ వరకు బాగానే ఉన్నా, అసలు తీర్పు ఎప్పుడు వస్తుందో అని అందరూ ఎదురు చూసారు. అయితే సిబిఐ కోర్టులో మాత్రం, జగన్ పిటీషన్ పైన కాకుండా, విజయసాయి పిటీషన్ పై నే వాదనలు కొనసాగాయి.
విజయసాయి రెడ్డి వేసిన కౌంటర్ పై, రఘురామ తరుపు న్యాయవాదులు కౌంటర్ ఇచ్చారు. విజయసాయి రెడ్డి సాక్ష్యులను బెదిరించినట్టు ఆధారాలు లేవని, వారు ఎవరూ కోర్టుకు రాలేదు కదా అని అన్నారు. అంతే కాదు, సిబిఐ ఏమి అభ్యంతరం చెప్పకపోతే, రఘురామరాజుకు ఎందుకు అని వాదించారు. దీని పై రఘురామ లయార్లు అదే మా పాయింట్ కూడా అన్నారు. సాక్ష్యులను బెదిరిస్తే ఎవరు ముందుకు వస్తారని, అలాగే సిబిఐ వైఖరి పై కూడా తమకు అనుమానాలు ఉన్నాయి కాబట్టే, కోర్టుకు వచ్చామని అన్నారు. ఈ సమయంలో సిబిఐ కోర్టు వాదనలు ముగిసినట్టు ప్రకటిస్తూ, విజయసాయి రెడ్డి బెయిల్ రద్దు తీర్పుతో పాటుగా, జగన్ బెయిల్ రద్దు తీర్పు కూడా ప్రకటిస్తామని, రెండూ ఒకేసారి ప్రకటిస్తే మీకు ఏమైనా ఇబ్బందా అని న్యాయవాదులను అడగగా, తమకు ఏమి అభ్యంతరం లేదని చెప్పటంతో, రెండు కేసు తీర్పులను, వచ్చే నెల 15కు వాయిదా వేస్తూ, ఆ రోజు రెండు కేసులకు సంబంధించి తీర్పు ఇస్తామని ప్రకటించారు. దీంతో అనేక ట్విస్ట్ లు మధ్య, చివరకు ఏమి జరగకుండానే వాయిదా పడింది.