తెలంగాణ ఎన్నికల సమయంలో తమ మద్దతు కాంగ్రెస్‌కే నంటూ వైసీపీ వ్యవస్థాపకుడు, తెలంగాణ యూనిట్ జనరల్ సెక్రటరీ శివకుమార్ పత్రికా ముఖంగా లేఖ విడుదల చేయడంతో ఆయనను పార్టీ నుంచి జగన్ శాశ్వతంగా బహిష్కరించిన విషయం తెలిసిందే. అప్పట్లో జగన్ నిర్ణయాన్ని తప్పుబట్టిన శివకుమార్, రాజ్యాంగం ప్రకారం పార్టీ వ్యవస్థాపకుడిని బహిష్కరించే అధికారం ఎవరికీ లేదని అన్నారు. తాజాగా మరోసారి తన బహిష్కరణపై నిరసన వ్యక్తం చేశారు. ఆయన సోమవారం హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ దగ్గర అంబేడ్కర్ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు.
ఎలాంటి కారణాలు లేకుండానే తనను పార్టీ నుంచి బహిష్కరించడంలో దాగిఉన్న వాస్తవాలను ప్రజలకు వివరిస్తానని శివకుమార్ పేర్కొన్నారు. తనకు జరిగిన అన్యాయంపై ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి జిల్లాలోనూ దీక్ష చేపడతానని ప్రకటించారు. నల్ల బ్యాడ్జీలు ధరించి ఆయన అనుచరులతో కలిసి నిరసనలో పాల్గొన్నారు. వైసీపీలో ధనవంతులకే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి మనస్తత్వం కలిగిన జగన్ లాంటి వారు ప్రజలకు ఏ రకంగా సేవ చేస్తారని శివకుమార్ నిలదీశారు. తెలంగాణలో ఉద్దేశపూర్వకంగానే పార్టీని నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు. ‘జోహార్ వైఎస్ఆర్.. తెలంగాణ నుంచి జగన్ సార్ పరార్’ అనే ప్లకార్డులను ప్రదర్శిస్తూ నిరసన తెలియజేశారు. ఆంధ్రాలో ఫోకస్ పెట్టిన జగన్ భవిష్యత్తులో తెలంగాణలో పోటీ చేస్తాడని అనుకోవడం లేదని, 2024 కు సంస్థాగతంగా బలపడదామని చెబుతున్నా తనకు నమ్మకం లేదని అప్పట్లో శివకుమర్ వ్యాఖ్యానించారు.
దీంతో జగన్ ఆయనను పార్టీ నుంచి బహిష్కరించారు. వైఎస్ఆర్ ను తిట్టిన వాళ్ళకు ఓటు వెయ్యద్దు అన్నందుకు, దేశ చరిత్రలో పార్టీ వ్యవస్థాపకుడినే సస్పెండ్ చేసిన ఘనత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు. వైఎస్ఆర్ చివరి కోరిక కూడా 42 ఎంపీ సీట్లు గెలిపించి రాహుల్ గాంధిని ప్రధానిని చెయ్యటమే అని, ఆయన ఎన్నో సార్లు ఇది మీడియా ముఖ్యంగానే చెప్పారని, వైఎస్ఆర్ వారసుడు అయిన జగన్ మాత్రం అందుకు విరుద్దుంగా వెళ్తున్నారని అన్నారు. వైఎస్ జగన్ కోరిక మేరకు పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి, అతనిని అధ్యక్షుడిగా ఎన్నుకుంటే తనను సస్పెండ్ చేశారని తెలిపారు. జగన్ 16 నెలలు జైలుకెళ్లినా కూడా పార్టీని ఇక్కడ బతికించుకున్నామని చెప్పారు. పార్టీ నుంచి బహిష్కరించే ముందు కనీసం తన వివరణ కూడా అడగలేదన్నారు. త్వరలోనే కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటానన్నారు.