ఉదయం నుంచి జగన్, విశాఖపట్నం పర్యటన పై, అందరి ఫోకస్ ఉంది. దీనికి కారణం కూడా లేకపోలేదు. జగన్ మోహన్ రెడ్డి విశాఖపట్నంను పరిపాలనా రాజధానిగా ప్రకటన చేసారని, జగన్ మోహన్ రెడ్డికి భారీగా స్వాగతం పలకాలని, మా ప్రాంతాన్ని రాజధానిగా చేసినందుకు, ఘన స్వాగతం పలకాలి అంటూ, విజయసాయి రెడ్డి ఏకంగా, కల్లెక్టరేట్ లనే రివ్యూ పెట్టి, హడావిడి చేసిన సంగతి తెలిసిందే. 24 కిమీ మేర, మానవహారం ఉంటుందని, 40 వేల మంది జగన్ కు స్వాగతం పలుకుతారని, కనీవినీ ఎరుగని స్వాగతం పలుకుతారని విజయసాయి రెడ్డి చెప్పటంతో, ఈ రోజు జగన్ విశాఖపట్నం పర్యటన పై ఆసక్తి వచ్చింది. విశాఖ ఉత్సవ్ కార్యక్రమంలో పల్గునటానికి జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు విశాఖపట్నం వచ్చారు. విజయసాయి చెప్పినట్టు ఘనమైన ఏర్పాట్లు, 24 కిమీ మానవహారం కాకపోయినా, సెంటర్లలో బాగానే జన సమీకరణ చేసి, జగన్ మోహన్ రెడ్డికి స్వాగతం పలికారు. ఎయిర్ పోర్ట్ నుంచి, జగన్ మోహన్ రెడ్డి, విశాఖ ఉత్సవ్ కార్యక్రమం జరిగే ప్రదేశానికి హాజరు అయ్యారు.
ఆయన ఈ కార్యక్రమంలో పాల్గుని, విశాఖ ఉత్సవ్ ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో, జగన్ మోహన్ రెడ్డి అజెండా అంటూ ఒక షార్ట్ ఫిలిం ని ప్లే చేసారు. విశాఖలో ఉన్న ప్రతిష్టాత్మక సంస్థలు, ప్రత్యేకతలు తెలిసేలా ఆ షార్ట్ ఫిలిం కొనసాగింది. విశాఖ కోసం జగన్ కట్టుబడి ఉన్నారంటూ, ఆ ఫిలిం లో చూపించారు. ఈ ఫిలింని, అక్కడకు వచ్చిన ప్రజలు, అతిధులు తిలకించారు. తరువాత లేజర్ షో ఒక పది నిమిషాలు జరిగింది. జగన్ తో పాటుగా, కాంగ్రెస్ ఎంపీ సుబ్బిరామి రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గున్నారు. లేజర్ షో అయిన తరువాత, జగన్ మోహన్ రెడ్డి మాట్లాడతారని, విశాఖపట్నంను పాలనా రాజధానిగా తాను అసెంబ్లీలో చేసిన ప్రతిపాదన పై చెప్తారని అందరూ అనుకుని, జగన్ సందేశం కోసం ఎదురు చూసారు.
అయితే వారందరికీ జగన్ షాక్ ఇచ్చారు. అనూహ్యంగా, ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. లేజర్ షో అవ్వగానే, అందరికీ అభివాదం చేసి, వెనుదిరిగారు. ఒక్క ముక్క కూడా మాట్లాడకుండానే జగన్ వెనుదిరిగారు. ఆర్కె బీచ్ నుంచి విశాఖ ఎయిర్ పోర్ట్ కు బయలుదేరారు జగన్. రేపు విశాఖ ఉత్సవ్ ముగింపు వేడుకలకు గవర్నర్ బిశ్వ భూషణ్ హాజరుకానున్నారు. అయితే ఇంత భారీ హంగామా, ఇంత హడావిడి చేసి, కనీసం ఒక్క ముక్క కూడా జగన్ మాట్లాడకుండా వెళ్ళిపోవటం పై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీని వెనుక వ్యూహం ఏమిటో ఎవరికీ అర్ధం కవాటం లేదు. కనీసం విజయసాయి రెడ్డి దగ్గర ఉండి, ఇంత హంగామా చేసినందుకు అయినా, జగన్ మోహన్ రెడ్డి మాట్లాడి ఉండాల్సింది అని, అంటున్నారు. మొత్తానికి, ఇంత హడావిడి చేసి, జగన్ మాట్లాడకుండా వెళ్ళిపోయారు.