ఇటీవల వరకూ ముఖ్యమంత్రి ఏ సభలో పాల్గొన్నా, ఏ సమీక్షకి హాజరైనా ఒకటే మంత్రం జపించేవారు. అదే వైనాట్ 175. అది తన పార్టీ నేతలు, కార్యకర్తలకి ఉత్సాహం ఇచ్చే స్లోగన్ అని సీఎంకి తెలుసు. వాస్తవంలోకి వస్తే, పార్టీలో కోర్ టీములో వాళ్లుంటారో, ఉండరో తెలియని గందరగోళ పరిస్థితి. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి వెన్నుదన్నుగా నిలిచే ఆయన సామాజికవర్గం ఎమ్మెల్యేలు, కీలక నేతలు దూరం అవుతూ వస్తున్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పార్టీపై తిరుగుబాటు జెండా ఎగురవేశారు. పార్టీలో నెంబర్2గా చెలామణి అయ్యే విజయసాయిరెడ్డి చాలా రోజులుగా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. జగన్ రెడ్డి దగ్గర బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రాంతీయ సమన్వయకర్తగా ఉండలేనంటూ రాజీనామా చేశారు. వీరంతా దాదాపు వైకాపాకి దూరం అయినట్టే. వైకాపా నుంచి గెలిచిన ఎంపీ రఘురామకృష్ణంరాజు చాలా రోజులుగా వైకాపా చెవిలో జోరీగలా తయారయ్యారు. తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి క్రాస్ ఓటింగ్ పేరుతో దూరం పెట్టగా..మరో 18 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు టిడిపికి టచ్‌లోకి వెళ్లారనే వార్తలు వస్తున్నాయి. ఎన్నికల్లో 175 సీట్లు గెలవడం అటుంచి ఇప్పుడున్న 151 మందిలో ఎంతమంది ఎన్నికల వరకూ జగన్ రెడ్డితో ఉంటారనేది ఇప్పుడు వైకాపాలో హాట్ టాపిక్‌గా నడుస్తోంది.
వై నాట్ 175 సంగతి సరే.. 151లో మిగిలేది ఎందరో?
Advertisements