రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మ హత్యలే ఉంటాయి అంటారు... ఆంధ్రప్రదేశ్ ప్రతి పక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డి ఈ విషయంలో పోటీ పడుతున్నారు... పన్నెండు రోజుల పాటు జరిగిన శాసనసభా సమావేశాలను బహిష్కరించడం ద్వారా వైసీపీ నాయకత్వం తప్పలో కాలేసింది. శనివారంతో ముగిసిన సమావేశాల్లో కీలకమైన అంశాలు ప్రవేశపెట్టిన ప్రభుత్వాన్ని నిలబెట్టి, నిలదీసే అవకాశాన్ని తమ నాయకత్వం చేతులారా పోగొట్టుకుందన్న ఆవేదన వైసీపీ ఎమ్మెల్యేలలో వ్యక్తమవుతోంది. చివరకు తాము వేసిన ప్రశ్నలపైనే అధికార పార్టీ సభ్యులు మంత్రులను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారని, అదే తాము హాజరయ్యి ఉంటే మరిన్ని ప్రశ్నలు సంధించి ప్రభుత్వాన్ని ఇరికించేవాళ్లమని వాపోతున్నారు.
సభను బహిష్కరించడం ద్వారా తాము సాధించిందేమీ లేకపోగా, ప్రభుత్వం సాధించిన విజయాలే ప్రజల్లోకి ఎక్కువగా వెళ్లాయని, దాన్ని అడ్డుకునే అవకాశం నాయకత్వం దూరం చేసుకుందన్న వ్యాఖ్యలు వైసీపీ ఎమ్మెల్యేలలో వినిపిస్తున్నాయి. అత్యంత కీలకమైన నీరుద్యోగ భృతి, అమరావతి నిర్మాణం, గృహ నిర్మాణాలు, కాపులకు రిజర్వేషన్, పోలవరం, పరిశ్రమలు, వ్యవసాయం వంటి అంశాల పై తాము చేసిన హోంవర్క్ అంతా జగన్ తీసుకున్న నిర్ణయంతో వృధా అయిందని వాపోతున్నారు. వీటిలో అమరావతి నిర్మాణం, పోలవరం, నిరుద్యోగ భృతి అంశాల పై బయట రోజూ ప్రభుత్వాన్ని ఆరోపణలతో ముంచెత్తామని, అదే సభకు హాజరై ఉంటే ప్రభుత్వం నుంచి మరిన్ని వివరణలు సాధించే వారమని చెబుతున్నారు..
అమరావతి, పోలవరం నిర్మాణాల పై తాము సభలో లేకపోవడంతో ప్రభుత్వం చెప్పిందే ఏకపక్షంగా జనంలోకి వెళ్లిందని, అదే తాము సభలో ఉంటే ఆ రెండు అంశాల పై ప్రభుత్వం అంత సులభంగా వ్యవహరించి బయటపడేది కాదంటున్నారు. ప్రధానంగా పోలవరం పై డాక్యుమెంట్లనీ తీసుకుని ఉంచుకున్నాం. కానీ, దానిని సభలో నిలదీసే అవకాశం లేకుండా పోయిందని ఓ ఎమ్మెల్యే వాపోయారు. "వచ్చే ఏడాదిలో కూడా కచ్చితంగా ఇలాంటి పరిస్థితులే ఉంటాయి. అప్పుడు బడ్జెట్ సమావేశాలు కూడా బహిష్కరించి ఇంట్లో కూర్చునే నిర్ణయం తీసుకుంటారా? మా బాసుకు ఎవరు సలహాలిస్తున్నారో తెలియదు. ఇలా అయితే ఎమ్మెల్యే లుగా ఉండటం వృధా అని మరో ఎమ్మెల్యే వాపోయారు.