జగన్ మోహన్ రెడ్డి, ఆకస్మికంగా ఢిల్లీ పర్యటన పెట్టుకున్నారు. నిన్న సాయంత్రం జగన్ ఢిల్లీ వెళ్తున్నట్టు మీడియాకు చెప్పారు. ఈ రోజు మూడు గంటల ప్రాంతంలో జగన్ ఢిల్లీ బయలుదేరి వెళ్ళారు. ఈ రోజు రాత్రికి కేంద్రం హోం శాఖ మంత్రి అమిత్ షాని జగన్ కలవనున్నారు. రేపు ఉదయమే మళ్ళీ తిరిగి అమరావతి వచ్చేస్తారు. జగన్ మోహన్ రెడ్డి ప్రధానిని కానీ, మరే ఇతర కేంద్ర మంత్రిని కలిసేది లేదని సమాచారం. అయితే అసలు ఈ పర్యటన ఎందుకో ? అమిత్ షాని ఎందుకు కలుస్తున్నారో మీడియాకు మాత్రం చెప్పలేదు. వరదల్లో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని జగన్, అమిత్ షా ని కలుస్తున్నారని వైసీపీ వర్గాలు అంటున్నాయి. ఇక జగన్ మీడియా యధావిధంగా ప్రత్యెక హోదా, పోలవరం, ఇది అదీ అంటూ ఊదరగొడుతుంది. జగన్ మోహన్ రెడ్డి, ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా, ఆయన ఎందుకు ఢిల్లీ వెళ్తున్నారో, ఏమి కోరుతున్నారో, బయటకు చెప్పరు. జగన్ సొంత మీడియా మాత్రం, ఏపి ప్రయోజనాల కోసం, కేంద్రం మెడలు వంచేసారు అనే విధంగా చెప్తే, మరో మీడియా కేంద్రం జగన్ చేస్తున్న పనులకు అక్షింతలు వేసారని చెప్తారు కానీ, అసలు ఏమి జరిగిందో తెలియదు. జగన్ పోయినసారి ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా ఇదే జరిగింది. చివరకు ప్రధానిని కలసినా ఎందుకు కలిసారో మీడియాకు చెప్పలేదు.
ఆ తరువాత వారం రోజులుకు, సుప్రీం కోర్టు కాబోయే చీఫ్ జస్టిస్ తో పాటుగా, మరో ఏడుగురు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిల పై ఫిర్యాదు ఇచ్చినట్టు, ప్రభుత్వం పెట్టిన మీడియా సమావేశం ద్వారా తెలిసింది. అయితే ఇప్పుడు జగన్ ఇంత సడన్ గా ఎందుకు ఢిల్లీ వెళ్లారు అనే దాని పై చర్చ జరుగుతుంది. బీజేపీ వర్గాలు మాత్రం, కేంద్రం పిలుపించుకుందని చెప్తున్నారు. రైతు బిల్లుల విషయంలో, బీజేపీ దేశ వ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తుంది, దానికి ఏపిలో సహకారం కావాలని కోరనున్నట్టు తెలుస్తుంది. ఇక మరో వాదన మాత్రం, జగన్ ఈ సారి కూడా కోర్టుల విషయంలోనే ఢిల్లీ వెళ్ళారని, హైకోర్టు చీఫ్ జస్టిస్ మార్పు వార్తలు వస్తున్న తరుణంలో, జగన్ ఢిల్లీ పర్యటన అందుకే అని అంటున్నారు. ఇక మరో వాదనగా, మూడు రోజులు క్రితం కేసీఆర్ చేసిన ఢిల్లీ పర్యటనకు, వెంటనే జగన్ ఢిల్లీ వెళ్తున్న దానికి సంబంధం ఉందని చెప్పే వాళ్ళు ఉన్నారు. ఇంత జరుగుతున్నా, ప్రభుత్వం వైపు నుంచి మాత్రం, ఎందుకు ఢిల్లీ వెళ్తున్నారో చెప్పే వాళ్ళే లేరు. చూద్దాం ఈ సారైనా, అధికారిక ప్రకటన ఇస్తారేమో.