వైసిపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి గుట్టు, రట్టు అయ్యే టైం వచ్చింది. బీజేపీతో జగన్ కలిసి పోయి ఆడుతున్న డ్రామాలకు ఇక తెర పడననుంది. అన్నీ ఇక బహిరంగంగానే జరగనున్నాయి. తెలుగుదేశం దూరం అవ్వటం, శివసేన అడ్డం తిరగటంతో, కేసిఆర్ జగన్ లను కలుపుకుని, మాకు బలం ఏ మాత్రం తగ్గలేదు అని బీజేపీ చూపించాలి అనుకుంటుంది. ఇందుకోసం, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికలను, బీజేపీ వాడుకుంటుంది. త్వరలో జరిగే రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక ఇటు టీఆర్ఎస్ కు, అటు వైసీపీల మద్దతు అమిత్ షా కోరారు. ప్రస్తుత డిప్యూటీ ఛైర్మన్ పీజే కురియన్ జూలై 2న పదవీ విరమణ చేస్తారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 18 నుంచి ప్రారంభం కానున్నాయి. మొదటి రెండు రోజుల్లోనే డిప్యూటీ చైర్మన్ ఎన్నికను పూర్తి చేసే అవకాశం ఉంది. రాజ్యసభలో మొత్తం సీట్లు 245. బిహార్ నుంచి ఖాళీ అయిన స్థానం ఇంకా భర్తీ కాలేదు. అంటే, రాజ్యసభ సంఖ్యా బలం 244. డిప్యూటీ చైర్మన్ పదవిని కైవసం చేసుకోవడానికి 123 ఓట్లు అవసరం.
కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాలకు 119 ఎంపీల మద్దతుండగా.. పీడీపీతో పొత్తు తెగిపోయిన తర్వాత బీజేపీకి, దాని మిత్రపక్షాలకు కలిపి 108 ఎంపీల బలం ఉంది. బీజేపీకి 76 మంది.. మిత్రపక్షాలు,, స్వతంత్రులు కలిస్తే 108 మంది సభ్యుల మద్దతు లభిస్తోంది. కాంగ్రె్‌సకు నామినేటెడ్‌తో కలిసి 52 మంది సభ్యులుండగా.. తృణమూల్, బీఎస్పీ, ఎస్పీ, వామపక్షాలు, స్వతంత్రులు, చిన్నాచితక పార్టీలతో కలిస్తే ప్రతిపక్షాల సంఖ్యా బలం 119 వరకూ పెరుగుతుంది. దాంతో, నాలుగు నామినేటెడ్ పదవుల భర్తీపై బీజేపీ దృష్టి సారించింది. ప్రముఖ క్రికెటర్ కపిల్ దేవ్, సినీ తారలు మాధురీ దీక్షిత్, అనుపమ్ ఖేర్, రాజ్యాంగ నిపుణుడు సుభాష్ కశ్యప్, మరాఠీ రచయిత బాబా సాహెబ్ పురంధరే తదితరుల పేర్లను పరిశీలిస్తోంది.
ఈ నాలుగు ఖాళీలనూ భర్తీ చేసినా.. డిప్యూటీ చైర్మన్ పదవిని కైవసం చేసుకోవడానికి ఎన్డీయేకు సంఖ్యా బలం సరిపోదు. ఫలితంగా.. దాదాపు 26 ఏళ్ల తర్వాత డిప్యూటీ చైర్మన్ పదవికి ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పట్లో అధికార కాంగ్రెస్ అభ్యర్థి నజ్మా హెప్తుల్లా ప్రతిపక్ష అభ్యర్థి రేణుకా చౌదరిపై 33 ఓట్ల ఆధిక్యంతో గెలిస్తే.. ఈసారి అధికార బీజేపీకి ప్రతిపక్షం ముచ్చెమటలు పోయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ ఎలాగూ జగన్ మద్ధతు అడుగుతుంది. ఆయన వారి కోరిక మేరకు కమలానికి జై కొడితే... ఆంధ్రాలో టీడీపీకి మరో బలమైన అస్త్రాన్ని ఇచ్చినట్టవుతుంది. ఇప్పటికే బీజేపీ - వైసీపీ మధ్య రహస్య స్నేహం కొనసాగుతోందని... కొన్ని ఆధారాలను టీడీపీ బయటపెట్టింది. తాజాగా డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికలో కమలానికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే మరింత ఇబ్బందులు వైసీపీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాదంటే మోడీ కన్నెర్ర - అవునంటే ఏపీ ప్రజలకు ఆగ్రహం అన్నట్టుగా వైసీపీ పరిస్థితి మారుతుంది.