ఈ నెల 21న జగన్ మోహన్ రెడ్డి హెలికాఫ్టర్ ల్యాండింగ్ లో నిర్లక్ష్యం వహించిన అంశం పై దర్యాప్తుకు ఆదేశించింది సీఎంఓ. సిఎంఓ ఆదేశాల పై ఈ అంశంలో పూర్తీ స్థాయిలో దర్యాప్తు చేస్తున్న డీఆర్వో వెంకటేశం, హెలికాఫ్టర్ ల్యాండింగ్ సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏడుగురు అధికారులకు నోటీసులు పంపించారు. ఈ నెల 21న కర్నూల్ జిల్లా నంద్యాల పర్యటనకు జగన్ వెళ్లారు. వరదలు వచ్చిన సందర్భంలో జగన్ అక్కడ పర్యటించిన సమయంలో, ఆయన హెలికాప్టర్ ల్యాండింగ్ పై అధికారులు తప్పుడు సమాచారం ఇచ్చారని అభియోగం. సహజంగా, హెలికాఫ్టర్ ల్యాండింగ్ వివరాలను ఒక క్రమ పద్ధతిలో డిగ్రీలు, మినిట్స్, సెకండ్స్ రూపంలో ఇస్తూ ఉంటారు. అయితే అక్కడ అధికారులు మాత్రం కేవలం డిగ్రీల్లో ఇచ్చారు. ఈ సందర్భంలో, హెలికాప్టర్ లాండింగ్ సమయంలో, కొంత గందరగోళం ఏర్పడింది. అక్కడ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, సిఎంఓ సీరియస్ అయ్యింది.
ముఖ్యమంత్రి కార్యాలయం ఈ విషయాన్ని తీవ్ర తప్పిదంగా భావించి, దర్యాప్తుకు ఆదేశించింది. నంద్యాలలో హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో, అక్కడ డ్యూటీలో సరిగ్గా వ్యవహరించలేదని అక్కడ అధికారుల పై సీఎంవో ఆగ్రహం వ్యక్తం చేస్తూ విచారణకు ఆదేసించటంతో, రంగంలోకి దిగిన కర్నూలు జిల్లా కలెక్టర్ జి.వీరపాండ్యన్ వెంటనే విచారణకు ఆదేశించారు. విచారణ అధికారిగా డీఆర్వో వెంకటేశంను నియమించి, పూర్తీ స్థాయి నివేదిక ఇవ్వమని కోరారు. కలెక్టర్ ఆదేశాల ప్రకారం, విచారణ ప్రారంభించిన డీఆర్వో వెంకటేశం, ఆ సమయంలో డ్యూటీలో ఉన్న ఏడుగురు అధికారులకు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 30న వ్యక్తిగతంగా తమ ముందు హాజరయ్యి, తమకు వివరణ ఇవ్వాలని అ నోటీసులో కోరారు.
సర్వే, ల్యాండ్ రికార్డు ఏడీ హరికృష్ణ, డ్వామా పీడీ వెంకట సుబ్బయ్య, శిరువెళ్ల, నంద్యాల, ఉయ్యాలవాడ తహసీల్దార్లు నాగరాజు, రమేష్‌బాబు, నాగేశ్వరరెడ్డి, గోస్పాడు ఎంపీడీవో సుగుణశ్రీ, నంద్యాల డిప్యూటీ సర్వే ఇన్‌స్పెక్టర్ వేణులకు గురువారం నోటీసులు అందాయి. నోటీసులు అందజేసి సమాధానం చెప్పాలని, విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు. గతంలో రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన సంగతి తెలిసిందే. వాతావరణం అనుకూలించక, ఆయన హెలికాప్టర్ కూలిపోయింది. ఆయానతో పాటు, కొంత మంది సిబ్బంది కూడా మరణించారు. అయితే ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డికి, కూడా హెలికాప్టర్ విషయంలో తేడా రావటంతో, ఈ విషయం పై అధికారులు సీరియస్ అయ్యారు.