లక్షల్లో జీతం... భద్రతతో కూడిన జీవితం... ఆక్షేపణలకు దూరంగా అందలాలకు దగ్గరగా అమెరికాలో జీవిస్తోన్న ఆమె అనూహ్యంగా రాజకీయ రంగప్రవేశం చేసింది. తొలి సమావేశంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబుని మెప్పించిన ఆమె వాక్చాతుర్యం ఎమ్మెల్యే అభ్యరిగా ఆయనలో నమ్మకం కలిగించింది. తండ్రి స్థానంలో తనకే అవకాశమన్న సీఎం ప్రతిపాదనకు ఆశ్చర్యపోయింది. నిన్నటిదాకా ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ కుమార్తెగా పరిచయస్తురాలైన షబానా ఖాతూన్ తెలుగుదేశం పార్టీ తరపున విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. ఆమె మాట్లాడుతూ, "పుట్టి, పెరిగింది, చదువు అంతా విజయవాడలోనే. 22 ఏళ్ల వరకు విజయవాడలోనే ఉన్నాను. వివాహానంతరం అమెరికా వెళ్లాను. ఏరోజూ రాజకీయాల్లోకి రావాలని ప్రయత్నించలేదు. నా కుటుంబం, నేను అంతే.. చాలనుకునేదాన్ని. ఇక్కడ ఒక ఐటీ సంస్థ పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారిని 2019 జనవరిలో కలిశాం."
"ఆ సమావేశంలోనే నాన్న స్థానంలో నాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశమిచ్చారు. అమ్మనాన్నతో మాట్లాడి చెబుతానన్నా. ఆయన భుజం తట్టి పంపారు. తర్వాత అమ్మతో మాట్లాడితే కొంత వెనకడుగేసింది. కానీ నాన్న, నా భర్త వెన్నంటి ప్రోత్సహించారు. రాజకీయం భయపడేది కాదు... సేవ చేసేదంటూ నాన్న వెన్ను తట్టారు. బీఏ లిటరేచర్ పూర్తయ్యాక కాలిఫోర్నియాలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు పూర్తి చేశాను. అప్పట్లో కుటుంబమే నా ప్రపంచం. నా భర్త ఓ ప్రముఖ ఐటీ సంస్థలో ప్రధానోద్యోగిగా ఉన్నారు. ఆయన ఆలోచనతోనే అమరావతిలో ఐటీ కంపెనీ నెలకొల్పాలని విజయవాడకు వచ్చాను. ఎన్నోసార్లు ఇక్కడకు వచ్చినా ఈసారి రాక మాత్రం నా జీవితాన్ని మలుపు తిప్పింది. ‘నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేయి’ అన్న సీఎం ప్రతిపాదనతో ఆశ్చర్యపోయాను."
అయితే మొదట్లో అంత సీరియస్‌గా తీసుకోలేదు. కానీ ప్రచారంలోకి వెళ్లాక టీడీపీపై, నాన్నపై స్థానికులు చూపిస్తున్న అభిమానంతో పాటు పలు సమస్యలు నాలో పోటీతత్వాన్ని ప్రేరేపించాయి. ఇపుడు నా లక్ష్యం గెలుపు మాత్రమే కాదు.. టీడీపీ నమ్మకాన్ని నిలబెట్టడం కూడా. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 70ు కొండ ప్రాంతమే. కొండ ప్రాంత నివాసితులు ఇక్కడ 40వేలకు పైగా ఉన్నారు. స్థానిక మురికివాడల్లో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్లను కలుసుకున్నాను. వాళ్లకు సరైన సమయంలో వైద్యం అందకే దివ్యాంగులుగా మారుతున్నారు. అమెరికాలో దివ్యాంగులకు ఇతరులతో సమానంగా ఉపాధి, వైద్య అవకాశాలు పుష్టిగా ఉన్నాయి. నా తొలి లక్ష్యం కూడా అదే. ముఖ్యమంత్రితో సంప్రదించి నియోజకవర్గ దివ్యాంగులకు అందరికి సమానమైన ఉపాధితో పాటు వారికి వైద్యం అందుబాటులోకి తెచ్చేలా చేస్తాను. ముస్లిం మహిళలపై వివక్ష అనేది నా చిన్నప్పటి మాట. ఇపుడు మగాళ్లతో పోటీగా మహిళలు కూడా పోటీపడుతున్నారు. సౌదీలాంటి దేశాల్లో కూడా మహిళలకు డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేస్తున్నారు. చైతన్యవంతమైన రంగాల్లో ముందుంటున్నారు. ఇస్లామిక్ దేశాల్లోనూ వివక్ష క్రమేణా సమసిపోతున్న తరుణంలో స్వేచ్ఛాయుత భారతదేశంలో ముస్లిం మహిళగా రాజకీయాల్లోకి రావడం ఇప్పటికే ఆలస్యమైంది. నాలాంటి మహిళలు మరికొందరికి స్ఫూర్తిగా నిలబడాల్సిన అవసరం ఉంది." అంటూ చెప్పుకొచ్చారు.