2019 ఎన్నికల్లో నేనే ముఖ్యమంత్రి అని చెప్తున్న పవన్ కళ్యాణ్, అభ్యర్ధుల ఎంపిక పై ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ బాగా బలంగా ఉన్న కృష్ణా జిల్లాలో, టిడిపి పార్టీకి ఒక్క సీట్ కూడా రాకూడదని, మంత్రి దేవినేని ఉమా అసెంబ్లీలో అడుగుపెట్ట కూడదు అని, దానికి తగ్గ ప్రణాళిక రచించమని, చింతలబస్తీ దేవ్ కు, పవన్ కళ్యాణ్ ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. దీంతో చింతలబస్తీ దేవ్ రంగంలోకి దిగినట్టు సమాచారం. పవన్ కళ్యాణ్ చెప్పినట్టే, కృష్ణా జిల్లాలో అన్ని సీట్లు జనసేన గెలిచేలా చింతలబస్తీ దేవ్ అదిరిపోయే స్కెచ్ వెయ్యటం, దాన్ని పవన్ కళ్యాణ్ కూడా ఆమోదించినట్టు తెలుస్తుంది.
మంత్రి దేవినేని ఉమాపై పోటీకి దింపటానికి రాజకీయంతో సంబంధంలేని ఓ ప్రముఖుడితో మంతనాలు జరుగుతున్నాయి. పామర్రు నుంచి సీటు ఇస్తే పోటీ చేయడానికి కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ఒకరు ప్రయత్నాల్లో ఉన్నారు. గన్నవరం సీటు కొప్పుల వెలమ సామాజికవర్గానికి చెందిన ఎన్‌ఆర్‌ఐ అడుగుతున్నారు. గుడివాడ సీటు ఇస్తే పార్టీలో చేరతానని కాంగ్రెస్‌కు చెందిన మాజీమంత్రి ఒకరు సంకేతాలు పంపుతున్నారు. గుడివాడ, కైకలూరు, పెడన నియోజకవర్గాల నుంచి బీసీ అభ్యర్థులను రంగంలోకి దించాలనే ఆలో చనతో నాయకుల కోసం అన్వేషిస్తున్నారు.
ప్రముఖ పారిశ్రామికవేత్త మాజీ ఎంపీ బాడిగ రామకృష్ణ రెండవ కుమార్తె విజయవాడ లేదా మచిలీపట్నం పార్లమెంటు సీటు అడుగుతున్నట్టు తెలుస్తోంది. పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు సన్నిహితుడు తోట చంద్రశేఖర్ భార్య అనురాధ అవనిగడ్డ ప్రాంతానికి చెందినవారు కావడంతో అవనిగడ్డ అసెంబ్లీ లేదా మచిలీపట్నం పార్లమెంటు నుంచి తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. సమయం తక్కువగా ఉండటంతో జనసేన గ్రౌండ్‌వర్క్ చేసుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆ పార్టీ సర్వేలు చేయించు కుంటోంది. దేవ్ అండ్ కో టీమ్‌తో పాటు హైదరాబాద్‌కు చెందిన రెండు యూనివర్సిటీల సిబ్బందితో సర్వేలు చేయిస్తున్నారు. ఈ సర్వేల ఆధారంగా కొంత కసరత్తు జరుగుతోంది. పొత్తుల ఖరారు, సీట్ల సర్దుబాటు వంటి అంశాలపై ఇంకా స్పష్టత లేనప్పటికి నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల కోసం జనసేననేతలు అన్వేషణ ప్రారంభించారు.