ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం సినీ నటుడు పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీకి ఊహించని షాకులు తగులుతున్నాయి. ముఖ్యనేతలు ఒకరి తర్వాత ఒకరు పార్టీకి గుడ్ బై చెప్తున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు రాజీనామా చేయగా..తాజాగా మాజీ సభాపతి, జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ ఆ పార్టీని వీడతారంటూ ప్రచారం జరుగుతోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్వహించిన గుంటూరు జిల్లా సమీక్షకు నాదెండ్ల హాజరుకాలేదు. దీంతో ఆయన పార్టీని వీడుతున్నారనే ప్రచారం జోరందుకుంది. ఈనేపథ్యంలో జనసేన పార్టీ స్పందించింది. నాదెండ్ల మనోహర్ అమెరికా పర్యటనలో ఉన్నందువల్లే సమావేశానికి హాజరు కాలేకపోయారని, కావాలని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపింది.
ఆయన పార్టీని వీడే ప్రసక్తి లేదని వెల్లడించింది. నాదెండ్ల మనోహర్ గుంటూరు జిల్లా తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. అదే జిల్లాకు చెందిన మాజీ మంత్రి, ప్రత్తిపాడు జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన రావెల కిశోర్‌బాబు జనసేన పార్టీకి నిన్న రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రెండు పర్యాయాలు తెనాలి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. తొలుత డిప్యూటీ స్పీకర్‌గా, ఆ తర్వాత స్పీకర్‌గా వ్యవహరించారు. గత ఎన్నికల ముందు జనసేన పార్టీలో మనోహర్ చేరారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడుచుకుపెట్టిన సమయంలోను ఆయన ఆ పార్టీలోనే ఉన్నారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచి, తిరిగి పుంజుకుంటున్న సమయంలో ఆయన జనసేన వెళ్లడంపై చర్చ జరిగింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లోనూ తిరిగి తెనాలి నుంచి జనసేన తరఫున అసెంబ్లీకి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.