ఏపీలో జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణంపై ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ దృష్టిసారించారు. అందులో భాగంగానే ఆయన ఏడు జిల్లాలకు బాధ్యులను నియమించారు. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలు సహా ఉభయ గోదావరులు, కృష్ణా, గుంటూరు జిల్లాలకు కన్వీనర్లు, జాయింట్ కన్వీనర్లను ప్రటించారు. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు త్వరలో బాధ్యులను ప్రకటించనున్నారు. అయితే పార్టీ పదవులు ప్రకటించిన జిల్లాలలో స్థానిక ముఖ్యనేతలు అసంతృప్తిగా ఉన్నారట. 2014 నుంచి పార్టీకోసం పనిచేసిన తమకు న్యాయం జరగలేదని వారు ఫీలవుతున్నారట. పవన్‌కల్యాణ్ క్రియాశీలకంగా లేకుండా, హైదరాబాద్ లో సినిమాలు తీసుకుంటున్నప్పుడు కూడా తాము జిల్లాల్లో కార్యక్రమాలు చేశామని గుర్తుచేస్తున్నారట. అలాంటి తమను కాదని కార్పొరేట్ వ్యక్తులకు, వ్యాపారులకు పదవులు దక్కాయని జనసైనికులు ఆవేదన చెందుతున్నారట.
గత నాలుగేళ్లుగా జనసేనలో కీలకంగా వ్యవహరించిన వారికంటే ప్రజారాజ్యంలో పనిచేసిన వారికే పదవులు కట్టబెడుతున్నారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. కులాల ప్రస్తావన లేని సమాజ నిర్మాణమే ధ్యేయమని చెప్తోన్న పవన్‌కల్యాణ్ ఒకే సామాజికవర్గానికి చెందినవారికి పార్టీ పదవుల్లో పెద్దపీట వేస్తున్నారని జనసేన శ్రేణులు చెవులు కొరుకుంటున్నాయి. ఇప్పటివరకూ ఆ పార్టీలో ఒకే సామాజికవర్గానికి చెందిన 80 శాతం మందికి పదవులు దక్కాయట! వ్యయప్రయాసలకు ఓర్చి తాము గత నాలుగేళ్ళుగా పార్టీ అస్తిత్వాన్ని కాపాడుతూ వచ్చామనీ.. అలాంటి తమను కాదని వేరే వారికి పార్టీ బాధ్యతలు ఇవ్వడమేంటనీ కొందరు గట్టిగా ప్రశ్నిస్తున్నారట కూడా!
ఈ నేపథ్యంలో జిల్లాల నుంచి కొందరు నేతలు హైదరాబాద్ వచ్చి జనసేన అధినేతని కలవాలని ప్రయత్నించారట. అయితే వారిని పవన్ దగ్గరకు వెళ్ళకుండానే కొందరు నిలువరించి, వెనక్కి పంపారన్నది విస్వసనీయ వర్గాల కథనం! దీంతో అసంతృప్త నేతలు తీవ్ర నిరాశ చెందారట. తమ పార్టీ అధినేత చుట్టూ అప్పుడే కనిపించని గోడలు ఏర్పడ్డాయని వారు బలంగా భావిస్తున్నారట! హైదరాబాద్‌లో పవన్‌ని కలవాలన్న తమ ప్రయత్నం విఫలం కావడంతో అసంతృప్త నేతలు వేరు మార్గం ఆలోచించారట. జిల్లాల పర్యటనకు పవన్ వచ్చినప్పుడే ఆయన వద్ద మన మనోభావాలు వ్యక్తంచేయాలని తలపోస్తున్నారట. చూద్దాం వారి ప్రయత్నం ఏమేరకు ఫలిస్తుందో.