జనసేన పార్టీ దుకాణం బంద్ అయిందని.. ఆ పార్టీ కార్యాలయాల ముందు టూ-లెట్ బోర్డులు దర్శనమిస్తున్నాయని సోషల్ మీడియాలో వైసీపీ విస్తృత ప్రచారం చేస్తోంది. దీంతో ఎలక్ట్రానిక్ మీడియాలోని కొన్ని ఛానళ్లు కూడా జనసేన పార్టీ ఆఫీసులు మూసేస్తున్నారంటూ ప్రచారం చేశాయి. ఈ ప్రచారంపై ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పార్టీ అభ్యర్థులతో ఆదివారం నిర్వహించిన సమీక్షలో స్పందించారు. నియోజకవర్గాల్లోని జనసేన కార్యాలయాలు యథావిధిగా కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. ఇది ఆరంభం మాత్రమేనని, సమాజంలో మంచి మార్పు రావాలనే ఉద్దేశంతో ముందుకు సాగాలని పవన్ పార్టీ అభ్యర్థులకు పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లి.. వారిని కలుసుకుని.. సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పవన్ పార్టీ అభ్యర్థులకు సూచించారు.
ఎన్నికల ప్రక్రియ ముగిసినందున భవిష్యత్‌లో ప్రజల్లోకి వెళ్లేందుకు వీలుగా ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసుకోవాలని జనసేన నిర్ణయించింది. ఇందుకు రాజకీయ క్యాలెండర్ రూపొందించుకుని ముందుకుసాగాలని భావిస్తోంది. వచ్చేనెల 23న ఎన్నికల ఫలితాలు వెలువడనున్న దృష్ట్యా కౌంటింగ్ కేంద్రాల్లో పార్టీ ఏజెంట్లు, అభ్యర్థులు తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించనుంది. రాష్ట్రంలో తొలిసారి ఎన్నికల బరిలో నిలిచిన జనసేన అభ్యర్థులకు ఓట్లు వేసినవారికి కృతజ్ఞతలు తెలిపేందుకు నేతలు జిల్లాల్లో పర్యటించనున్నారు.
ఆ తర్వాత గాజువాక, భీమవరం అసెంబ్లీ, నరసాపురం లోక్‌సభ స్థానాల పరిధిలోని అభ్యర్థులు, ముఖ్యనేతలతో పవన్ సోదరుడు, నరసాపురం ఎంపీ అభ్యర్థి నాగబాబు సమావేశం కానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇదేవిధంగా అభ్యర్థులు, నాయకులతో భేటీలుంటాయి. ఇంకోవైపు.. స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన దృష్టి సారించింది. తెలంగాణలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటిచింది. ఏపీలోనూ బరిలోకి దిగుతామని చెబుతోంది. కాగా పార్టీ ఇప్పటికీ కొన్ని జిల్లాల్లో సంస్థాగత కమిటీలను వేయలేదు. కొన్ని లోక్‌సభ నియోజకవర్గాలకు కూడా కమిటీలు లేవు. వీటి నియామకానికి పవన్ సన్నద్ధమవుతున్నారు.