ఏ ప్రభుత్వం అయినా ఎలా పని చేస్తుందో చెప్పటానికి, ప్రజలే నిర్ణయిస్తారు. వారికి ఉన్న సమస్యల లెక్క తీస్తే, ఆ ప్రభుత్వం ఎలా పని చేస్తుంది అనేది ఇట్టే చెప్పవచ్చు. 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న నాటికి, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి సమస్య ఉంది అంటే ఆశ్చర్యం కాదేమో. అందుకే చంద్రబాబు మొదటి సారి జన్మభూమి కార్యక్రమం పెట్టగానే, సమస్యలు వచ్చి పడ్డాయి. అన్నీ ఇన్నీ సమస్యలు కాదు, ఏకంగా 40 లక్షల సమస్యలు. ఇందులో రేషన్ కార్డు లేదని, పించన్ రావటం లేదని, ఇల్లు కావాలని, ఇలా అనేక వ్యక్తిగత సమస్యలు చుట్టుముట్టాయి. అప్పుడే ఏర్పడిన రాష్ట్రం, ఆర్ధిక ఇబ్బందులు ఉన్నాయి. అయినా సరే, చంద్రబాబు, వీరికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు.
తక్షణం వారి సమస్యలు పరిష్కరించాలని ఆదేశాలు ఇచ్చారు. అర్హులైన అందరికీ ఆయా సమస్యలు తీర్చారు. అలా, ప్రతి సంవత్సరం జన్మభూమి పెడుతూ, ఇప్పటి వరకు ఆరు విడతలు పెట్టారు. అందరి సమస్యలు తీరుస్తూ వస్తున్నారు. తాజగా జరిగిన ఆరవ విడత జన్మభూమిలో కూడా వినతులు వచ్చాయి. అయితే, క్రితం సంవత్సరాలతో పోల్చుకుంటే, అవి చాలా వరకు తగ్గిపోయాయి. 2014లో 40లక్షల వినతులు వస్తే, ఇప్పుడు మాత్రం, కేవలం 5.6 లక్షల వినతులు వచ్చాయి. అంటే దాదాపుగా 80 శాతం ప్రజల కష్టాలు తీరిపోయాయి. ఇవి కూడా ఎక్కువ పధకాలు పెట్టటం వల్ల, అనేక మంది కొత్తగా లబ్దిదారులు అవ్వటం, వలన వచ్చిన వినతులు. ఒక పక్క సంక్షేమం పెద్ద ఎత్తున చేస్తూనే, మరో పక్క, రోడ్లు, డ్రైనేజిలు, ఇలా అన్ని చోట్లా మౌలిక సదుపాయాలు కూడా మెరుగు పరుస్తున్నారు.
జన్మభూమి ముగింపు సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. ‘‘జన్మభూమిలో ప్రజా సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరిస్తున్నాం. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాం. మండల స్థాయిలో తహసీల్దార్, ఎంపీడీవోలతో కలుపుకొని పనిచేశాం. జన్మభూమిలో 1800 మండల బృందాలతో కలిసి పనిచేశాం. రాష్ట్రంలో 12,918 గ్రామ పంచాయతీల్లో కార్యక్రమాలు చేపట్టాం. నాలుగేళ్లపాటు చేసిన అభివృద్ధి పనులను సమర్థంగా ప్రజల్లోకి తీసుకెళ్లాం. జన్మభూమిలో 1.28లక్షల మంది అధికారులు 1.70లక్షల కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గ్రామ, వార్డు అభివృద్ధి ప్రణాళికలు తయారు చేశాం. జరిగిన అభివృద్ధిపై గ్రామాల్లో డిజిటల్ పెయింటింగ్స్ వేయిస్తున్నాం. రాష్ట్ర, జిల్లా అభివృద్ధి ప్రణాళిక త్వరలో తయారు చేస్తాం. జన్మభూమిలో పది రోజుల్లో 61.13 శాతం మంది పాల్గొన్నట్లు చెప్పారు. సుస్థిర అభివృద్ధి, ఇతర అంశాలపై చర్చ జరిగిందని 83శాతం మంది చెప్పారు. జన్మభూమి కార్యక్రమం బాగుందని 77.97 శాతం మంది చెప్పారు. జన్మభూమిలో 5.60లక్షల ఫిర్యాదులు వచ్చాయి. ఫిర్యాదుల్లో 33వేలకు పైగా రియల్‌టైమ్‌లో పరిష్కరించాం’’ అని సీఎం చంద్రబాబు తెలిపారు.