ప్రత్యేక హోదా అన్నది ఆంధ్రుల హక్కని, తెలుగు ప్రజల మనోభావాలు దెబ్బతీస్తే తగిన గుణపాఠం తప్పదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. జపాన్ తరహా ఆందోళన చేయడం ద్వారా హక్కులు సాధించుకుంటామని తెలిపారు. ఒక వైపు నిరసన ప్రకటిస్తూ మరోవైపు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించడమే లక్ష్యంగా పనిచేస్తున్నానని అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ చాలా నష్టపోయే అవకాశం ఉందని చెప్పారు. తన మనవాడి పుట్టిన రోజును పురస్కరించుకుని, ఈ రోజు శ్రీవారిని దర్శించుకున్నారు చంద్రబాబు.. స్వామి వారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రంపైన పోరాటం కొనసాగుతూనే ఉందన్నారు.
జపాన్ తరహాలో ఆందోళన, అభివృద్ధి రెండూ కొనసాగుతోంది. మా ఇంటి కులదైవం - నేను ఆరాధించే దేవుడు వేంకటేశ్వరస్వామి అన్నారు. ‘ప్రత్యేక హోదా పోరాటానికి సమాంతరంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత నాపై ఉంది. అందుకే జపాన్ తరహా పోరాటం చేస్తున్నాను. ఏపీ హక్కుల కోసం ప్రాంతీయ పార్టీల సహకారన్ని తీసుకుంటూ కేంద్రంపై ఒత్తిడితెస్తా. రాష్ట్రాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని శ్రీవారిని ప్రార్థించా’’ అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. నా రాజకీయ జీవితంలో ఇప్పటివరకు మూడు సంక్షోభాలు చూశాను. ఆగస్టు సంక్షోభం తరువాత రాష్ట్ర విభజన మరో సంక్షోభం. ఇప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వకుండా రాష్ట్రానికి తీరని అన్యాయం చేయటం మరో సంక్షోభం. ఈ సంక్షోభాల నుంచి ఎలా గట్టెక్కాలో నాకు బాగా తెలుసు అని ముఖ్యమంత్రి అన్నారు.
ఇది ఇలా ఉండగా, జపాన్ తరహా ఉద్యమం పై తెలుగుదేశం అధ్యయనం చేస్తుంది... జపాన్ తరహా ఉద్యమం అంటే, మన నిరసన, ఎవరికీ నష్టం లేకుండా చెయ్యటం... అంటే ఉద్యోగులు మరింత ఎక్కువగా పనిచేయడం, రహదారులను ఊడ్చడం, పట్టణాలు, నగరాల్లో మౌన ప్రదర్శనలు చేయడం వంటి వాటి ద్వారా కేంద్రం పై ఒత్తిడి పెంచాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది... ఈ నిరసనలు ఎలా ఉండాలి ? ఇంకా ఎంత వినూత్నంగా, ఎవరికీ నష్టం జరగకుండా, అదే విధంగా మన కష్టం, బాధ ఎదుటి వారికి తెలియ చేసేలా, ఉద్యమం ఉండాలని చంద్రబాబు అంటున్నారు... ఈ విధంగా, ఆంధ్రప్రదేశ్ ప్రగతి, ఉద్యమాన్ని సమాంతరంగా నడపాలనేది చంద్రబాబు యోచన...