ఆంధ్రప్రదేశ్‌పై కేంద్రం చూపుతున్న వివక్షను ప్రజలకు తెలియజెప్పేందుకు అనంతపురం వేదికగా బుధవారం తెలుగుదేశం పార్టీ ఎంపీలు నిరసన దీక్ష చేపట్టారు. అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఉదయం 9 గంటలకు ప్రారంభమైన దీక్ష సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ‘కరవు నేలపై కేంద్రం వివక్ష’ పేరుతో చేపట్టిన ఈ నిరసన కార్యక్రమంలో ప్రధానంగా కేంద్రం చేసిన మోసాన్ని ఎండగట్టనున్నారు. కరవు ప్రాంతాలకు ఎంత వరకు సాయం అందించారు.. ఎలాంటి వివక్ష చూపారన్నది ప్రజలకు వివరిస్తున్నారు. ఈ సందర్భంగా జేసి దివాకర్ రెడ్డి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఎప్పుడైతే వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతి అయ్యి వెళ్ళిపోయాడో, అప్పుడే మనకు చుట్టుకుంది అని అన్నారు.
వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి కావడం కూడా రాష్ట్రానికి శాపమైందని జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఏపీపై కేంద్రం వైఖరికి నిరసనగా జిల్లాలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఎంపీలు దీక్షకు దిగారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కేంద్రంలో మోదీ అధికారంలో ఉన్నంత వరకు ఏపీకి బెల్లం ముక్క కూడా ఇవ్వరని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని చంద్రబాబుకు కూడా చెప్పానని అన్నారు. అయితే రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము ప్రయత్నం చేయాలని సీఎం అన్నారని తెలిపారు. పదవులు వస్తున్నకొద్దీ హుందాగా వ్యవహరించాలని ఆయన సూచించారు. కేంద్రం హామీలు ఇచ్చి మోసం చేయడం న్యాయమా అని జేసీ ప్రశ్నించారు.
మరో పక్క సియం రమేష్ మాట్లాడుతూ, ఈనెల 18 నుంచి జరిగే వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రాన్ని వదిలిపెట్టం అని, మన సమస్యల గురించి చర్చించే దాక వదిలిపెట్టమని అన్నారు. ఈనెల 17న ఢిల్లీలో జరిగే అఖిలపక్షం సమావేశానికి దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి హాజరుకావాలని సవాల్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీని నిలదీయడానికి జగన్ రావాలని రమేష్ అన్నారు. ఈ నెల 18 నుంచి ఆగస్టు 10 వరకు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో, తెలుగుదేశం పార్టీ, మరో సారి అవిస్వాసం పెడుతుందని, మోడీ మనకు చేసిన అన్యాయం గురించి, చట్ట సభల్లో చర్చిస్తామని, ఈ సారైనా, బీజేపీ పారిపోకుండా, చర్చ జరపాలని అన్నారు.